అల్లుడి వేధింపులు తట్టుకోలేకపోయిన మామ.. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదంటూ.. చివరికి ఒక రోజు..

ప్రతీకాత్మక చిత్రం

పిల్లలు పుట్టిన తరువాత అల్లుడిలో మార్పు వస్తుందని ముసకుట్టి కుటుంబం భావించింది. కానీ పిల్లలు పుట్టిన తరువాత కూడా అతడిలో మార్పు రాలేదు.

 • Share this:
  కట్నం కోసం వేధింపులకు గురి చేయడం కొందరు శాడిస్టు మగాళ్లకు బాగా అలవాటు. ఈ విషయంలో ఇలాంటి వారికి భయం పుట్టేలా చేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు, చట్టాలు తీసుకుని వస్తున్నా.. కొందరిలో మాత్రం ఆశించిన స్థాయిలో మార్పు కనిపించడం లేదు. భార్య, ఆమె పట్టింటి వారిని వేధించే విషయంలో తమ శాడిజాన్ని యధేచ్ఛగా ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి వారి పెట్టే బాధలను తట్టుకోలేక కొందరు మహిళలు బలవన్మరణానికి పాల్పడుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట ఇలాంటి వార్తలు వస్తున్నాయి. కానీ అల్లుడి అదనపు కట్నం వేధింపులు తట్టుకోలేక.. అతడికి పిల్లను ఇచ్చిన మామ అత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కేరళలో మంపడ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

  ఉరంఘట్టిరికి చెందిన 30 ఏళ్ల హమీద్‌కు తన కూతురు హిబాను ఇచ్చి గతేడాది పెళ్లి చేశాడు మూసకుట్టి అనే వ్యక్తి. ఎంతో మంచి వాడు అని నమ్మి తన కూతురిని ఇస్తే.. ఆ తరువాత కొద్దిరోజులకే తన అసలు రూపం చూపడం మొదలుపెట్టాడు హామీద్. పెళ్లికి 18 తులాల బంగారం పెడితే.. ఆ తరువాత మరింత బంగారం తీసుకురావాలని భార్యను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో తనకు ఆర్థికంగా భారమైనా.. అల్లుడి కోసం కూతురికి మరో ఆరు తులాల బంగారం పెట్టాడు ముసకుట్టి. అయితే అయినా హమీద్ ప్రవర్తనలో మార్పు రాలేదు.

  పిల్లలు పుట్టిన తరువాత అతడిలో మార్పు వస్తుందని ముసకుట్టి కుటుంబం భావించింది. కానీ పిల్లలు పుట్టిన తరువాత కూడా అతడిలో మార్పు రాలేదు. దీనికి తోడు ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్న హమీద్.. తనకు మరో పది తులాల బంగారం ఇస్తేనే.. భార్య, పిల్లను తనతో పాటు తీసుకుని వెళతానని షరతు విధించాడు.

  అల్లుడి వేధింపులు తట్టుకోలేకపోయిన ముసకుట్టి.. తీవ్ర మానసిక వేదనకు లోనయ్యాడు. కూతురి కాపురం ఏమవుతుందో అని మదనపడిపోయాడు. అల్లుడి అదనపు కట్నం కోరిక తీర్చలేక.. తాను పని చేస్తున్న రబ్బర్ ఫ్యాక్టరీలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఆత్మహత్యకు కారణమైన తన భర్త హమీద్‌పై హిబా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు హమీద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
  Published by:Kishore Akkaladevi
  First published: