మహబూబ్నగర్: పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తేచాలు.. ఆ పిండాన్ని తల్లి గర్భంలోనే చిధిమేస్తున్నారు కొందరు. అవాంతరాలన్నింటినీ ఎదుర్కొని భూమి మీదికి వచ్చిన తర్వాత కూడా వారిని అనంత లోకాలకు పంపిస్తున్నారు మరికొందరు. పసిగుడ్డులని కూడా చూడకుండా చంపేస్తున్నారు. తాజాగా ఒకే కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు జన్మించడంతో తట్టుకోలేక ఆ శిశువులకు విషమిచ్చాడో తండ్రి. ఈ దారుణ సంఘటన మహబూబ్నగర్ జిల్లా గండేడ్ మండలంలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశాయిపల్లికి చెందిన కృష్ణవేణి, కేశవులు దంపతులకు ఈ నెల 1న రాత్రి కవల ఆడపిల్లలు జన్మించారు. అప్పటికే వారికి ఒక కూతురు ఉంది. రెండో కాన్పులోనూ కవల ఆడశిశువులే పుట్టారని కేశవులు ఆవేదనచెందాడు. కోపంతో ఆ శిశువులను చంపేందుకు యత్నించాడు. దీంతో భార్యకు తెలియకుండా 4 రోజుల కవల ఆడ శిశువులకు పురుగుల మందు తాగించాడు. పిల్లలు అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో తల్లి కంగారు పడింది. హుటాహుటిన ఇద్దరు పిల్లలను చిల్డ్రెన్ హాస్పిటల్లో చేర్పించారు. కేశవులు తనకేమీ తెలియనట్లుగా నటించాడు.
చిన్నారులను పరిశీలించిన వైద్యులు వారిద్దరికి విషం ఇచ్చినట్లు గుర్తించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం మహబూబ్నగర్ జిల్లా దవాఖానకు శిశువులను తరలించారు. అయితే కేశవులు పురుగుల మందు డబ్బా కొనుగోలు చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ ఇద్దరు చిన్నారులు జిల్లా కేంద్ర దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:September 04, 2020, 12:18 IST