జైపూర్: ఆయన వయసు 50 ఏళ్ల పైమాటే. ఆయనకు పెళ్లీడుకొచ్చిన కూతురు ఉంది. ఈ ఇద్దరూ కలిసి ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కారు. మరో ముగ్గురితో కలిసి కార్లు దొంగిలించి వాటి రూపురేఖలు మార్చి సెకండ్ హ్యాండ్లో అమ్మే దందాకు తెరలేపారు. అలా వచ్చిన సొమ్ముతో ఆనందంగా గడిపారు. కానీ.. చేసిన నేరం ఏదో ఒకరోజు బయటపడక తప్పదు కద. ఆ రోజు రానే వచ్చింది. ఆ తండ్రీకూతురితో సహా ఈ ముఠాలో భాగమైన మరో ముగ్గురు ప్రస్తుతం జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు.
ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్కాన్, ఆమె తండ్రి అబ్దుల్ పాళీలోని మార్వార్ జంక్షన్లో ఉంటుండేవాళ్లు. ముస్కాన్ పెద్దగా చదువుకోలేదు కానీ స్మార్ట్‌ఫోన్ వాడకం, యాప్స్ వినియోగించడంలో ముందుండేది. ఈ తండ్రీకూతుర్లు కష్టపడకుండా డబ్బు సంపాదించాలని భావిస్తున్న తరుణంలో కార్లు దొంగిలించే గ్యాంగ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ కార్లు దొంగిలించే గ్యాంగ్ కార్లు అయితే దొంగిలిస్తున్నారు గానీ వాటిని అమ్మడం పెద్ద సవాల్‌గా మారింది. ఈ క్రమంలో వాళ్లకు ముస్కాన్, ఆమె తండ్రి సాయం చేశారు. ఆ ముగ్గురూ కార్లు దొంగిలించి ఈ తండ్రీకూతురికి అప్పగించేవాళ్లు. వీళ్లు ఆ కార్లను అమ్మే బాధ్యతను తీసుకున్నారు. ముందుగా దొంగిలించాలని భావించి ప్లాన్ చేసిన కారు ఫొటోలను తీసి ముస్కాన్‌కు ఆమె తండ్రికి నిందితులు పంపేవాళ్లు.
ఈ తండ్రీకూతురు ఆ ఫొటోలను చూపిస్తూ మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించి తక్కువ ధరకే కారు అందుబాటులో ఉందని వాళ్లకు ఫొటోలను చూపించేవాళ్లు. కొనే వ్యక్తి సిద్ధంగా ఉన్నాడని ముస్కాన్, ఆమె తండ్రి గ్యాంగ్‌లో కారును దొంగిలించే వ్యక్తులకు సమాచారం ఇవ్వగానే ఆ కారును తస్కరించడం, ఆ దొంగిలించిన కారును ఈ తండ్రీకూతురు అమ్మడం అన్నీ చకచకా జరిగిపోతుండేవి. ఆ కారును అమ్మిన డబ్బు వీళ్లకు కస్టమర్లు ఫోన్‌పే, పేటీఎం ద్వారా చెల్లించేవాళ్లు. అలా డబ్బు రాగానే ఈ గ్యాంగ్ సొమ్మును పంచుకుని హ్యాపీగా గడుపుతుండేవాళ్లు.
ఇలా మొత్తం 12 కార్లను ఈ గ్యాంగ్ దొంగిలించి ఈ తండ్రీకూతురు సాయంతో సెకండ్ హ్యాండ్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంది. ఈ గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడైన మలిరామ్ మీనా అనే వ్యక్తి ఓ బైక్ దొంగతనం కేసులో జైలుకెళ్లి వచ్చిన వాడే కావడం గమనార్హం. కార్లు కనిపించకుండా పోయాయంటూ ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో పోలీసులు ఈ వ్యవహారంపై సీరియస్‌గా దృష్టి సారించి ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్‌లో మరో సభ్యుడైన నరేంద్ర కూడా ఓ కేసులో జైలుకెళ్లి 2021 మార్చిలో విడుదలై బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక కూడా వీళ్లు బుద్ధి మారకపోగా ఈ కార్ల చోరీకి పాల్పడి ఎవరికీ అనుమానం రాకుండా ఈ తండ్రీకూతుర్లను అడ్డం పెట్టుకుని సెకండ్ హ్యాండ్లో కార్ల అమ్మకానికి తెరలేపారు. చివరకు ఈ గ్యాంగ్ మొత్తం కటకటాల పాలైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Father, Jaipur, Rajasthan