కనిపించీ కనిపించగానే నచ్చడం.. ఆకర్షణకు గురికావడం.. ఆలోచనలు.. అభిరుచులు.. సమాజరీతులను.. వాస్తవాలను మరచి మరీ తెగింపు చేయడం.. చివరకు పరిస్థితులు ఎదురుతిరగడంతో చావడం.. లేదా చంపడం.. ఇలా నిండు జీవితాన్ని బలవణ్మరణాలకు దారితీయిస్తున్న విషాధాలెన్నో.. దాదాపు ప్రతి వివాహేతర సంబంధం ఏదో ఒకనాడు చెడు ఫలితానికే దారితీస్తుంటుందన్నది జరుగుతున్న వాస్తవం.. నిష్టుర సత్యం.. నిత్యం ఏదో ఒక చోట ఇలాంటివి చోటుచేసుకుంటునే ఉన్నా.. ఇంకా ఆకర్షణల వలలో చిక్కుకుంటూనే ఉన్న యువతీయువకులు.. మధ్య వయస్కులు.. ఆ విషబంధం నుంచి బయటపడలేక చివరకు శవాలుగా.. మరికొన్ని సార్లు అనాథ శవాలుగా మార్చురీలే చిరునామాగా మారుతున్నారు.
సమాజాన్ని పట్టిపీడిస్తున్న వివాహేతర సంబంధాలకు మరో యువతి బలైపోయింది. ఆమె ఎవరో.. ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎక్కడికి పోవాలని బయలుదేరిందో.. ఎవరు చంపారో.. కానీ కసిగా చంపారని మాత్రం పోలీసులకు లభ్యమైన ఆనవాళ్లు.. నేర స్థలంలో దొరికిన వస్తువులు.. మృతదేహంపై ఉన్న గాయాలను బట్టి చెబుతున్నారు. ఒకవేళ ఆమె కోసం ఎదురుచూసే పిల్లలు ఉంటే.. భార్య వస్తుందని ఎదురుచూసే భర్త ఉంటే.. కన్నకూతురు ఇంకా ఇంటికి రాలేదని ఇంటి గేటుకు వైపే చూస్తుండే తల్లిదండ్రులు ఉంటే.. పరిస్థితి ఏంటి..? ఆవేశంలో ఒకరు చేసే తప్పులకు కుటుంబసభ్యులు జీవితాంతం కుమిలికుమిలి ఏడ్వాల్సిన దుస్థితి తలెత్తుతోంది. ఖమ్మం నగర పరిసరాల్లోని రామన్నపేట రైల్వేట్రాకుపై గోనె సంచిలో కుక్కి పడేసిన మహిళ మృతదేహం విషయంలో పోలీసులు వస్తున్న కంక్లూజన్ ఇది.
జనవరి 7వ తేదీన ఖమ్మం నుంచి మహబూబాబాద్ వెళ్లాల్సిన రైలుకు టికెట్‌ను రిజర్వు చేసుకున్న ఆధారం మాత్రమే ఆ మృతదేహం నుంచి దొరికింది. అంటే ఏడో తేదీన రైల్లో ప్రయాణిస్తూ.. శివారు ప్రాంతంలో మూలమలుపుల్లో నెమ్మదిగా వెళ్లే రైలు నుంచి దిగే అవకాశం ఉన్నట్టు.. అక్కడే ఎవరినో కలుసుకున్నట్టు.. ఆనక జరిగిన పరిణామాల్లో దారుణ హత్యకు గురైనట్టు అంచనా వేస్తున్నారు. బలమైన రాడ్‌తో తలను పగలగొట్టడం.. పొట్ట భాగాన్ని కొంతమేర పదునైన కత్తితో చీల్చినట్టుండడం.. లాంటి ఆనవాళ్లను బట్టి తొలుత హత్యానంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరకి మాయం చేయాలని భావించినా.. ఆలోచన మార్చుకుని గోనెసంచిలో కుక్కి రైలుకింద పడేసినట్టు స్పష్టమవుతోంది. కాకపోతే మృతదేహం రైలుకింద పడకపోగా.. తలభాగం కనిపిస్తూ ఉండడంతో అటుగా పొలం పనులకు వెళ్లే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు ప్రారంభమైంది.

ప్రతీకాత్మక చిత్రం
దాదాపు పదమూడు రోజుల క్రితం ఒక మహిళను దారుణంగా చంపి గోనెసంచిలో కుక్కి.. రైల్వే ట్రాకు పై పడేసినా.. ఎవరూ గుర్తించని ప్రాంతం కావడం.. కనీసం ఇప్పటిదాకా సమీప ప్రాంతాలలో ఎక్కడా నడివయసు మహిళ మిస్సింగ్ కేసులకు సంబంధించిన ఫిర్యాదులేవీ రాకపోవడంతో.. ఈమె ఎవరన్న దానిపై పలు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ఎవరైనా ఆమెపై లైంగికదాడికి పాల్పడి, అనంతరం చంపేసి ఉంటారా అంటే.. రైల్లో ప్రయాణిస్తున్న మహిళను బలవంతంగా కిందకు దింపే పరిస్థితి ఉండదు.. ఒకవేళ అలాంటి ఘటన చోటుచేసుకున్నా.. తోటి ప్రయాణికులు నిలువరించే అవకాశం ఉంటుంది.. లేదా కనీసం తర్వాతైనా పోలీసులకు సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అవేవీ జరగలేదు.. అంటే ఇది ఖచ్చితంగా ఎక్స్ట్రా మారిటల్ అఫైర్ అయ్యే అవకాశం ఉందన్నది పోలీసుల అంచనా..
ఏ ఫంక్షన్లోనో.. పార్టీలోనో కొత్త వ్యక్తులు పరిచయం కావడం.. లేక పాతకాలపు స్కూళ్లు.. కాలేజీల స్నేహాలు పునఃప్రారంభం కావడం.. దీనికి మొబైల్ ఫోన్లు.. సామాజిక మాధ్యమాలు.. గ్రూపులు వేదికలు కావడంతో ఆకర్షణలు చిగురిస్తున్నాయి. అప్పటికే కుటుంబం ఉన్నా.. కొత్త ఒక వింత.. పాత ఒక రోత అన్నట్టు పరిస్థితి తయారై.. పరిచయాలు.. ఆకర్షణలకు గురికావడం.. స్నేహం పేరిట మొదలై ఆనక ప్రేమగా. . అది కాస్తా ముదిరి వివాహేతర బంధం దాకా వెళ్లడం.. ఫలితం ఏదో ఒక రోజు విషాధాంతానికే దారితీస్తోంది. అది హత్యా.. లేక ఆత్మహత్యా అన్నది అప్రస్తుతం.. మొత్తానికి కుటుంబాల్లో తీరని వేదన.. సమాజ విచ్ఛిన్నం.. ఇలా నిత్యం ఏదో ఒక మూల కేసులు నమోదవుతునే ఉన్నా.. కళ్ల ముందే కఠోర వాస్తవాలు కనిపిస్తునే ఉన్నా మనుషులు మాత్రం మనసులు చూపే మార్గమే ఎంచుకోవడం వైచిత్రి. ఇక్కడి ఈ కేసులో మాత్రం ఏంజరిగింది.. ఆమె ఎవరన్నది తేలాల్సి ఉంది. అప్పటిదాకా సమాజంలో గౌరవంగా బతికి.. ఒక చిన్న పొరబాటు వల్ల జీవితం అంతమై.. రోజుల తరబడి అనాథ శవంలా రైలు ట్రాకుపై పడి ఉండే పరిస్థితి.. ఆలోచిస్తే ఎవరైనా తప్పు చేస్తారా..? అసలు ఆలోచనే చేస్తారా..? అంటే చెప్పలేని పరిస్థితి.
Published by:Srinivas Munigala
First published:January 21, 2021, 14:27 IST