దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ, వ్యాధి సోకిన వారిని ఎలాగైనా బతికించుకోవాలని బాధితుల కుటుంబ సభ్యులు ఆరాటపడుతున్నారు. ఇందుకు రూ.లక్షల్లో సైతం ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాలు మోసగాళ్ల బారిన పడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. కోవిడ్ సోకిన వ్యక్తికి ఇంటి దగ్గరే వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేసింది ఒక కోవిడ్ రోగి భార్య. బాధితుడికి ఒక వైద్యుడు, నర్సు వచ్చి చికిత్స అందించారు. అయితే పది రోజుల తరువాత కూడా తన భర్త పరిస్థితి మెరుగు పడకపోవడంతో, ఆమెకు అనుమానం వచ్చింది. ఆ డాక్టర్ గురించి ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. ఇన్ని రోజులు తన భర్తకు చికిత్స చేసిన వ్యక్తి వైద్యుడే కాదని ఆమె గుర్తించింది. ఇప్పటి వరకు ఆ నకిలీ డాక్టర్ తమ నుంచి రూ.1.50 లక్షలు వసూలు చేశారని సదరు మహిళ అహ్మదాబాద్‌లోని అమ్రావాడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. అహ్మదాబాద్‌లోని ఖోఖ్రా ప్రాంతంలో నివసిస్తున్న మేఘా సిర్సాత్ అనే మహిళ భర్త విశాల్‌కు ఇటీవల కరోనా సోకింది. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో పాటు CT స్కాన్‌లో అతడికి కోవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అతడిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇదే సమయంలో వీరి ఇంటికి దగ్గర్లో ఉండే మరో వ్యక్తికి సైతం కోవిడ్ నిర్ధారణ అయింది. అతడి ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ఒక వైద్యుడు వారి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఈ విషయం తెలుసుకున్న మేఘా, తన భర్తకు సైతం చికిత్స అందించాలని ఆ డాక్టర్‌ను కోరింది. అప్పటి నుంచి నరేంద్ర పాండ్య అనే ఒక వైద్యుడు, బాధితురాలి భర్తకు వైద్య సేవలు అందిస్తున్నాడు. అతడితో పాటు రినా బహెన్ అనే నర్సు కూడా మేఘా ఇంటికి వచ్చేవారు.
వీరు విశాల్‌కు ప్రతిరోజు ఒక బాటిల్ సెలైన్, ఇంజెక్షన్లు, ఇతర మందులు ఇచ్చేవారు. ఇందుకు రోజూ రూ.10,000 వసూలు చేసేవారు. ఇలా మొత్తం 15 రోజుల పాటు బాధితుడికి చికిత్స చేశారు. అయినా కూడా అతడి ఆరోగ్యం మెరుగుపడలేదు. పైగా పరిస్థితి మరింత దిగజారింది. దీంతో మేఘా, వారి బంధువులు నరేంద్ర పాండ్యను ప్రశ్నించారు. అసలు అతడు ఏ హాస్పిటల్లో పనిచేస్తున్నాడని ప్రశ్నించడా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. వారికి అనుమానం వచ్చి ఆరా తీయగా.. నరేంద్ర పాండ్య అసలు డాక్టరే కాదని తెలిసింది. దీంతో మోసపోయినట్టు గ్రహించిన బాధితుడి కుటుంబ సభ్యులు, విశాల్‌ను స్థానిక హాస్పిటల్లో చేర్పించారు.
ఈ ఘటనపై అందిన ఫిర్యాదు ఆధారంగా సదరు డాక్టర్, అతడి బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు. అతడు నకిలీ వైద్యుడని తేల్చారు. వీరి బృందంలోని నర్సు ఒక హాస్పిటల్లో కంపౌండర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు మేఘా కుటుంబ సభ్యుల నుంచి నకిలీ డాక్టర్ రూ.1.50 లక్షలు వసూలు చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై తదుపరి దర్యాప్తు జరుగుతోంది. ఇలాంటి విపత్కర సమయాల్లో నకిలీ వైద్యుల బారిన పడి మోసపోవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. ప్రభుత్వం గుర్తించిన కోవిడ్ హాస్పిటళ్లలోనే వ్యాధి సోకిన వారికి చికిత్స అందించాలని చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ahmedabad, Corona effect, Corona virus, Covid-19