Fake Currency: వ్యాపారంలో నష్టం వచ్చిందని దొంగనోట్ల తయారీ.. చివరికి ఏమైందంటే..

నిందితులను చూపుతున్న పోలీసులు, స్వాధీనం చేసుకున్న దొంగనోట్లు

Fake Currency: వ్యాపారంలో నష్టం వచ్చిన ఓ వ్యక్తి దొంగనోట్లను తయారు చేయడం ప్రారంభించాడు. తనకు ఉన్న కంప్యూటర్ పరిజ్ఞానంతో అచ్చం అసలైన నోట్లలాగా ఉండే నకిలీ నోట్లను తయారు చేసేవాడు. చివరకు పోలీసులకు సమాచారం అందడంతో బాగోతం బయటపడింది.

  • Share this:
    కొందరు సులువుగా డబ్బులు సంపాధించడమే లక్ష్యంగా అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. వక్రబుద్ధితో జనాలను మోసగించి సొమ్ము చేసుకుంటున్నారు. ఏదో ఒక రోజు వారి పాపం పండి పోలీసులకు చిక్కుతున్నారు. ఆఖరికి జైలు పాలవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వ్యాపారంలో నష్టం వచ్చిన ఓ వ్యక్తి దొంగనోట్లను తయారు తయారు చేయడం ప్రారంభించాడు. తనకు ఉన్న కంప్యూటర్ పరిజ్ఞానంతో అచ్చం అసలైన నోట్లలాగా ఉండే నకిలీ నోట్లను తయారు చేసేవాడు. మూడు నెలల నుంచి ఇదే పని చేస్తున్నాడు. ఆ నోట్లను జిల్లాలోని వివిధ షాపుల్లో చెలామణి చేస్తూ వారిని మోసం చేస్తున్నాడు. విశ్వాసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు ఆ మోసగాళ్లను అరెస్టు చేసి జైలుకు తరలించారు.

    మేడికొండూరు సీఐ ఆనందరావు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాయపాలెం గ్రామానికి చెందిన షేక్ అహ్మద్ గత 30 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా జుక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామంలో నివసిస్తున్నాడు. అక్కడ అతడు నిర్వహించిన వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. అయితే అతనికి ఉన్న కంప్యూటర్ పరిజ్ఞానంతో దొంగ నోట్లను తయారు చేసి డబ్బులు సంపాధించాలని భావించాడు. తమ సమీప బంధువైన విజయవాడ నగరానికి చెందిన షేక్ కరీముల్లా తో కలిసి మేడికొండ పేరేచర్లలోని ఎల్ఎన్ఎస్ కాలనీకి మకాం మార్చాడు. అక్కడ గత మూడు నెలల నుంచి రాత్రి సమయాల్లో ఇద్దరూ కలిసి దొంగ నోట్లను ముద్రిస్తున్నారు.

    ఈ ముద్రించిన నకిలీ నోట్లను జిల్లాలోని వివిధ ప్రాంతాలలో షాపులలో చలామణి చేస్తున్నట్లు సీఐ చెప్పారు. తమకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం నకిలీ నోట్లు ముద్రిస్తున్న గృహంపై దాడులు నిర్వహించామన్నారు. దాడుల్లో సుమారు రూ. 13, 200 రూపాయల విలువైన రూ. 500, రూ. 200, రూ. 100, రూ. 50 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నమన్నారు. వాటితో పాటు నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించే కంప్యూటర్ స్కానర్, నోట్ల తయారీకి ఉపయోగించే కాగితాన్ని సీజ్ చేశామన్నారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.
    Published by:Nikhil Kumar S
    First published: