Home /News /crime /

Fake Challans Scam: ఏపీలో నకిలీ చలాన్ల స్కాం.. కోటి రికవరీ.. సీఎం జగన్ ఏం చెప్పారంటే..?

Fake Challans Scam: ఏపీలో నకిలీ చలాన్ల స్కాం.. కోటి రికవరీ.. సీఎం జగన్ ఏం చెప్పారంటే..?

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

ఏపీలో భారీ స్కాం కలకలం రేపుతోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నకిలీ చలాన్లతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు కొందరు. ఈ భారీ స్కాంపై ఆరా తీసిన సీఎం జగన్ ఏం చెప్పారంటే..

    ఆంధ్రప్రదేశ్ భారీ కుంభకోణం కలకలం రేపుతోంది. ముఖ్యంగా నకిలీ చలాన్లతో ఏపీ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది. కడప సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలాన్ల కుంభకోణం వెలుగుచూసిన తర్వాత రాష్ట్రంలో అన్ని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో 2018నుంచి ఆన్ లైన్ ద్వారా అప్ లోడ్ చేసిన చలాన్లపై పరిశీలన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈ అవకతవకలు గుర్తించారు. గుంటూరు జిల్లాలో 35 సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ శ్రీనివాసరావు ఆదేశాలతో తనిఖీలు చేపట్టారు. మంగళగిరి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలాన్లతో మోసం జరిగినట్లు గుర్తించారు. 2020 జనవరి నుంచి అప్ లోడ్ చేసిన చలాన్ల తనిఖీల్లో మోసాలు బయటపడ్డాయి. 2021 జనవరి నుంచి నకిలీ చలాన్లతో మోసం జరిగినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి దాదాపు ఎనిమిది మంది పూర్తిస్థాయిలో స్టాంప్ డ్యూటీ కట్టినట్లు చలాన్లు సమర్పించినా ప్రభుత్వ ఖజానాకు మాత్రం జమకాలేదు. దీంతో నకిలీ చలాన్ల ద్వారా మోసం చేసినట్లు అధికారులు తేల్చారు. మరికొన్ని డాక్యుమెంట్లలో చలాన్ల రూపంలో స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు చూపించినా సీఎంఎఫ్ఎస్ లో మాత్రం ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. దాదాపు 8మంది ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. దీంతో ఆస్థులు కొనుగోలు చేసి స్టాంప్ డ్యూటీ చెల్లించని వారికి అధికారులు నోటీసులు జారీ చేశారు. సబ్ రిజిష్ట్రార్ ఫిర్యాదుతో మంగళగిరి టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ చలాన్లతో ప్రభుత్వాన్ని మోసం చేసిన వారి వివరాలను కూడా అందించారు.

    నకిలీ చలాన్ల మోసంపై విచారణ ప్రారంభించారు పోలీసులు. నకిలీ చలాన్లతో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన ఘటనల్లో కొంతమంది డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయం ఉందని, వారికి కొంతమంది సిబ్బంది కూడా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ చలాన్ల కేసులో… కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోని ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది. వీరు చలాన్లలో భారీ అవకతవకలకు పాల్పడినట్టు విచారణలో నిర్ధారించారు. మరికొందరు స్టాంప్ రైటర్లపై అధికారులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

    మరోవైపు బోగస్ చలనాల కుంభకోణంపై సీఎం జగన్ సైతం ఆరా తీశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. అక్రమార్కుల నుంచి సొమ్ము రికవరీపై ఫోకస్ పెట్టాలని సీఎం సూచించారు. ఇప్పటికే కోటి రూపాయల మేర సొమ్మును రికవరీ చేసినట్టు వెల్లడించిన అధికారులు… సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసినట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ల సాఫ్ట్ వేర్ ను ఎన్ఐసీ, సీఎఫ్ఎంఎస్ లకు అనుసంధానం చేయడం ద్వారా అవకతవకలకు చెక్ చెప్పొచ్చని సీఎంకు వివరించారు అధికారులు. దాంతో మరింత లోతైన దర్యాప్తు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది.

    ఏపీ వ్యాప్తంగా 17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చలనాల కుంభకోణం జరిగిందని గుర్తించాం అని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ శేషగిరిబాబు అన్నారు. ఇప్పటి వరకు 5 రూపాయల మేర నిధులు పక్క దారి పట్టినట్టు గుర్తించాం. అందులో కోటి రూపాయలు రికవరీ చేశామన్నారు. బోగస్ చలనాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తుల విషయంలో ఏం చేయాలనే అంశంపై న్యాయ సలహాలు తీసుకుంటున్నాం. ఆస్తులని రిజిస్ట్రేషన్ చేసినట్టు ప్రస్తుతం రికార్డుల్లో ఉంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొత్త సాఫ్ట్ వేర్ అందుబాటులోకి వచ్చింది. కొత్త సాఫ్ట్ వేర్ ను సీఎఫ్ఎంఎస్ తో అనుసంధానం చేశాం. ఎవరెవరి పాత్ర ఏ మేరకు ఉందనేది పోలీసుల విచారణలో తేలుతుంది అని పేర్కొన్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Crime news, Registrations

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు