• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • FAKE BABAS CHEATED SEVERAL WOMEN IN SIRCILLA NS

Fake Babas: ఆ పూజ చేయకుంటే మీ ఆయన పోతాడంటూ.. కరోనా వేళ కొత్త బాబాల మోసాలు

Fake Babas: ఆ పూజ చేయకుంటే మీ ఆయన పోతాడంటూ.. కరోనా వేళ కొత్త బాబాల మోసాలు

ప్రతీకారాత్మక చిత్రం

Sircilla: కరోనా వేళ సిరిసిల్ల జిల్లాలో దొంగబాబాలు తయారయ్యారు. ఒంటరిగా ఉన్న మహిళలు, అమాయకులను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. పూజలు చేయకుంటే మీకు నష్టం జరుగుతుందంటూ భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు.

  • Share this:
    కరోనా వేళ సిరిసిల్ల జిల్లాలో కొత్త బాబాలు తయారయ్యారు. అమాయకులు, ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో వారం రోజులుగా ఇలాంటి మోసాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. కాషాయ దుస్తులు, ముఖంపై తిలకాలతో దొంగబాబాలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. ఇంట్లో మగవాళ్లు బయటకు వెళ్లడం గమనించి.. ఇంట్లో ఉన్న మహిళల వద్ద ప్రత్యక్షం అవుతున్నారు. ‘మీ ఇంట్లో మృత్యుదేవత తిష్ట వేసింది. శాంతి లేకుండా చేస్తోంది. పూజలు చేస్తే అంతా శుభం కలుగుతుంది. ఆలస్యమైతే మీ ఆయన చనిపోతాడు’ అంటూ భయందోళనలకు గురి చేస్తున్నారు.

    ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌, గొల్లపల్లి, వెంకటాపూర్‌గ్రామాల్లో ఇలాంటి ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మూడు రోజుల కిందట ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో ఓ మహిళ ఇంటికి కారులో కాషాయ దుస్తుల్లో వచ్చిన ఇద్దరు బాబాలు ఇంట్లో అశాంతి నెలకొందని మాయమాటలు చెప్పారు. పూజలు చేస్తే మంచి జరుగుతుందని నమ్మించారు. దీంతో ఆ మహిళ ఇంట్లో ఉన్న రూ.17 వేలు ఆ దొంగబాబాలకు అప్పగించింది. ఓ కొబ్బరి కాయ, నిమ్మకాయలు ఇచ్చి వారు అక్కడ నుంచి జారుకున్నారు. మరుసటి రోజు అదే గ్రామంలోని మరో మహిళ వద్దకు వెళ్లారు. మీ ఆయనకు దెయ్యం పట్టింది. తొలగిపోవాలంటే తాము పూజలు చేసిన ఓ తాయత్తు ఇస్తామని అందుకు రూ.25 వేలు చెల్లించాలన్నారు. దీంతో సదరు మహిళ దాచుకున్న డబ్బును వారికి ముట్టజెప్పింది. ఆమె భర్త వచ్చిన తర్వాత చేతికి కట్టేందుకు ప్రయత్నించగా అందుకు ఒప్పుకోలేదు. అతనికి అనుమానం వచ్చి అందులో ఏముందోనని చూస్తే తెల్లకాగితం కనిపించడంతో మోసపోయినట్లు గ్రహించారు.

    బొప్పాపూర్‌ గ్రామంలో ఓ మహిళ ఇంటి వద్ద బీడీలు చుడుతోంది. కారులో అటువైపు వెళ్తున్న దొంగబాబాలు ఆమెను చూసి దగ్గరకు వెళ్లారు. ‘మీ ఇంటిల్లిపాది అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ధనం మీ దరిచేరడం లేదు’ అంటూ మాటలు చెప్పారు. పూజలు చేస్తే అంతా శుభం కలుగుతుందని అందుకు రూ.5 వేలు ఖర్చు అవుతుందని మాయ మాటలు చెప్పారు. ఇదంతా నమ్మని ఆ మహిళ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంట్లోకి వెళ్లి వ్యవసాయ పొలం వద్ద ఉన్న తన భర్తకు ఫోన్‌ చేసింది. వెంటనే దొంగ బాబాలు ఆమె ముఖంపై మత్తు కలిపిన నీళ్లు చల్లడంతో ఆమె ఏం మాట్లాడలేదు. ఈ క్రమంలో మహిళ భర్త ఇంటికి చేరుకున్నాడు. దొంగ బాబాలు అతడిపైనా నీళ్లు చల్లి వారి దగ్గర ఉన్న రూ. 5 వేలు తీసుకుని పారిపోయారు. కొద్దిసేపటికి వారు తేరుకుని లబోదిబోమన్నారు. గొల్లపల్లిలో ఓ వ్యాపారి వద్దకు వెళ్లి వ్యాపారంలో నష్టం కలుగుతుందని ధనయంత్రం, పూజలు జరిపితే కోటీశ్వరుడివి అవుతావంటూ రూ.లక్షన్నర తీసుకెళ్లినట్లు సమాచారం. ఇలా గ్రామంలో సుమారు 15 మంది వద్ద రూ.6 లక్షల వరకు వసూలు చేశారని తెలుస్తోంది.

    వెంకటాపూర్‌లో ఓ పలుకుబడి కలిగిన వ్యక్తి వద్ద నూతన ఇంటిలో పూజలు చేయాలని రూ.50 వేలు పట్టుకెళ్లారని సమాచారం. గ్రామాల్లో కొందరు వీరి తీరుపై అనుమానం వచ్చి నిలదీసిన సందర్భంలో పోలీసులంతా తమవారే అన్నట్లుగా పేర్లు చెప్పడంతో బాధితులు భయపడిపోయారు. గ్రామాల్లో దొంగబాబాలు సంచారిస్తున్నారనే విషయం తమ దృష్టికి రాలేదని పోలీసులు తెలిపారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. బాబాల మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. గ్రామాల్లో చైతన్య సదస్సులను నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఎల్లారెడ్డిపేట సీఐ బన్సీలాల్ తెలిపారు.
    Published by:Nikhil Kumar S
    First published: