భర్తను లేపేసిన భార్య... ఎవ్వరూ వెయ్యని ప్లాన్... పోలీసులు ఎలా దర్యాప్తు చేశారు?

ప్రతీకాత్మక చిత్రం

భర్త కోసం భార్య,... భార్య కోసం భర్త ప్రాణాలర్పించాల్సిన పని లేదు... కనీసం వాళ్లను చంపకుండా ఉంటే చాలు... కానీ ఈ రోజుల్లో చాలా ఈజీగా క్రైమ్ చేస్తున్నారు. అఫ్‌కోర్స్ పోలీసులు కూడా ఈజీగానే కనిపెట్టేస్తున్నారు.

 • Share this:
  ప్రతి సమస్యకూ హత్యే పరిష్కారం అనుకుంటున్నారు చాలా మంది. బెంగళూరు... దావణగెరెలోని జగళూరు పట్టణంలో అదే జరిగింది. స్థానిక బిదరకెరెలో దంపతులు బసవరాజప్ప, భాగ్య కలిసి మెలిసి జీవిస్తున్నారు. బసవరాజప్ప... ఎగ్ రైస్ హోటల్ వ్యాపారం చేస్తున్నాడు. అతని హోటల్ లో చేసే ఎగ్ రైస్ అంటే చాలా మందికి ఇష్టం. అంత చక్కగా చేస్తాడు బసవరాజప్ప. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి... ఆయన దగ్గర పార్శిల్ తీసుకెళ్తుంటారు. ఇలా ఆయన వ్యాపారం కరోనా టైంలో కూడా హాయిగా సాగింది. మంచి పేరు వచ్చింది. రోజూ వేలల్లో బిజినెస్ చేస్తున్నాడు. అంతా బాగానే ఉంటే... హత్య ఎందుకు జరిగిందన్నది తేలాల్సిన అంశం. బసవరాజప్ప.. కౌసల్య అనే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్నది భార్య అనుమానం. రోజూ వ్యాపారం ద్వారా వస్తున్న డబ్బును తీసుకెళ్లి... కౌసల్య చేతిలో పెడుతున్నాడని అనుకుంది. అందుకు తగ్గట్టే బసవరాజప్ప ఇంటికొచ్చినప్పుడు... డబ్బులు లేవంటున్నాడు. ఎందుకు అంటే... "కరోనా కదా... బిజినెస్ లేదు" అంటున్నాడు. "సర్లేండి... భోజనం పెడతాను... చేతులు కడుక్కురండి" అంటే... "నేను హోటల్ లో మిగిలింది తినేశాను... నాకు ఆకలి లేదు" అంటున్నాడు. ఇలా ఈ వ్యవహారం నడుస్తుంటే... ఆమెకు చిర్రెత్తుకొచ్చింది.

  ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి?:
  కౌసల్య మాయలో పడి... తన భర్త తనను సరిగా పట్టించుకోవట్లేదని భాగ్యకు ఒళ్లు మండింది. నానాటికీ ఆమెలో సహనం చచ్చిపోసాగింది. ఓ రోజు ఈ విషయమై నిలదీసింది. "అదేం లేదు... అడ్డమైనవి ఊహించుకోకు... ఎప్పుడూ ఆ మొబైల్ పట్టుకొని... ఆ వెబ్ సిరీస్‌లు అవీ చూడొద్దంటే... చూస్తావు... అందుకే నీకు ఇట్లా అనుమానపు బుద్ధి పుట్టింది" అని రివర్సయ్యాడు. అంత గట్టిగా చెప్పేసరికి... తానే తప్పుగా ఆలోచిస్తున్నానా అని అమెకు అనిపించింది. క్లారిటీ కోసం... హోటల్‌లో పనిచేస్తున్న అంజినప్పను... బిజినెస్ ఎలా సాగుతోందని ఆరా తీసింది. అంజినప్పు "ఓయమ్మో... సూపరమ్మా... అసలు ఖాళీయే ఉండదు... హోటల్ మూసేసే వరకూ వస్తానే ఉంటారు... ఒక్కోసారి వండింది కూడా సరిపోదు" అన్నాడు. దాంతో... భాగ్యలో కాన్ఫిడెన్స్ పెరిగింది. తానే కరెక్ట్ అనుకుంది. తన భర్త... కచ్చితంగా ఆదాయాన్ని ఆ కౌసల్యకు తగలేస్తున్నాడని గట్టిగా ఫిక్సైంది.

  మర్డర్ ప్లాన్:
  భర్తను చంపేయాలి అని డిసైడయ్యే ముందు రెండుమూడుసార్లు కౌసల్య విషయమై భాగ్య... భర్తతో గొడవపెట్టుకుంది. ప్రతిసారీ... ఆమెకు ఎదురుచెప్పాడు. అందుకే ఇక ఇలాంటి భర్త తనకు వద్దనుకుంది. అతన్ని లేపేస్తే... ఆ హోటల్ ఆదాయం మొత్తం తనకే వస్తుంది అనుకుంది. తనకు సన్నిహితంగా ఉంటున్న, తన భర్త హోటల్‌లో పనిచేస్తున్న అంజినప్పకు విషయం మొత్తం చెప్పి తన భర్తను చంపేద్దామని ప్లాన్ చెప్పింది. భర్త చచ్చాక... జీతం మరింత ఎక్కువ ఇస్తానంది. అలాగే... మర్డర్ చేసేందుకు కూడా ఓ లక్ష రూపాయలు ఇస్తానంది. దాంతో... అంజినప్ప కూడా డీల్ ఓకే అన్నాడు.

  హత్య జరిగిన రోజు:
  ఆ రాత్రి... హోటల్ మూశాక... బసవరాజప్ప... కౌసల్య దగ్గరకు వెళ్లాడు. ఆమె ఒళ్లో తల వాల్చి... "తలనొప్పి పోయింది పో" అన్నాడు. ఆమె అలా నోట్లో మద్యం పోస్తుంటే... గటగటా తాగాడు. "ఆహా అమృతం" అన్నాడు. "ఎప్పుడూ అమృతమేనా..." అంటే... సరే... అంటూ సరసంగా మాట్లాడాడు. ఈలోగా... ఆమె చేతులు... అతని జేబుల్లోకి వెళ్లడం... అతని జేబులో డబ్బు... ఆమె చేతుల్లోకి వెళ్లడం జరిగిపోయాయి. కాసేపటి తర్వాత ఇంటికి వెళ్లాడు.

  రోజూలాగే భార్య ఇంట్లో రాగి ముద్దను భోజనంగా పెట్టింది. హాయిగా తిన్నాడు. అందులో 10 నిద్రమాత్రలు కలిపిందన్న సంగతి అతనికి తెలియదు. భర్తకు అనుమానం రాకుండా నిద్రమాత్రలు కలపకుండా చేసిన మరో రాగి ముద్దను తన కంచంలో పెట్టుకుని అతని పక్కనే కూర్చొని తింది. బసవప్పకు నిద్ర ముంచుకొచ్చింది. ఆ సమయంలో బయట నక్కిన అంజినప్ప లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. తనతోపాటూ... చౌడప్ప(ఫ్రెండ్), మారుతి (ఆటోడ్రైవర్)ని వెంటబెట్టుకొచ్చాడు. అందరూ కలిసి... బసవప్ప గొంతునొక్కి పిసికి పిసికి చంపారు. తర్వాత... మారుతీ ఆటోలో శవాన్ని ఉంచి... ఊరి చివరకు తీసుకెళ్లి విసిరేశారు.

  ఆల్రెడీ బసవప్ప ఫేమస్ కదా... తెల్లారే సరికి విషయం పోలీసులకు తెలిసింది. వెళ్లి శవాన్ని చూశారు. భార్య భాగ్యకు కాల్ చేసి చెప్పారు. బోరున ఏడ్చేసింది... ఆ నంగనాచి కౌసల్యే... ఇదంతా చేయించి ఉంటుందని నాటకాలాడింది. కానీ పోలీసులు వెంటనే ఏదీ నమ్మేయరు కదా... రకరకాల కోణాల్లో పరిశీలించారు. పోస్ట్ మార్టం రిపోర్టులో రాగి ముద్దలో నిద్ర మాత్రలు కలిపిన విషయం తెలిసింది. ఆ నిద్ర మాత్రలను భాగ్య... అక్కడికి దగ్గర్లోని ఓ మందుల షాపులో కొంది. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ లో ఆ విషయం తెలిసింది. దాంతో ఆమెను గట్టిగా నిలదీశారు. మొత్తం మేటర్ బయటపెట్టింది. అలా అంతా భార్య వేసిన ప్లానే అని పోలీసులకు అర్థమైంది. ఆమెతోపాటూ... అంజినప్ప, చౌడప్ప, మారుతిని అరెస్టు చేశారు. ఇట్లా ఓ వివాహేతర సంబంధం... ఆ కుటుంబంలో చిచ్చుపెట్టింది. దీని వల్ల బసవప్ప ప్రాణం కోల్పోగా... మరో నలుగురు జైలుపాలయ్యారు.
  Published by:Krishna Kumar N
  First published: