ఓ ఉద్యోగి తన బాస్ నే చంపేయాలనుకున్నాడు. దాని కోసం ఏకంగా కరోనా సోకిన వ్యక్తి నుంచి ఉమ్మిని ప్రత్యేకంగా కొన్నాడు. ఆ తర్వాత ఆ ఉమ్మిని బాస్ తాగే కూల్ డ్రింక్ లో కలిపాడు. అంతే కాదండోయ్ ఆ తర్వాత బాస్ ఆఫీసుకు తెమ్మని ఇచ్చిన 22 లక్షల రూపాయలతో ఎస్కేప్ అయ్యాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే..
ఆఫీసుల్లో చాలా మంది ఉద్యోగులకు తమ బాస్ అంటే కోపం ఉంటుంటుంది. అడిగినప్పుడు సెలవు ఇవ్వలేదనో, అనవసరమైన వారికి ప్రాథాన్యం ఇస్తున్నారనో తమలో తాము మదనపడుతూ ఉంటారు. అదీ ఇదీ అని కాదు ఏ రంగం అయినా బాస్ లపై ఉద్యోగులకు ఈ కంప్లైంట్ అన్నిచోట్లా ఉండేదే. అయితే అది మరీ విపరీతస్థాయిలోకి వెళ్లి అతడిపై ప్రతీకారం తీర్చుకునే స్థాయిలో అయితే ఎక్కడా ఉండదు. కానీ ఓ చోట ఓ ఉద్యోగి తన బాస్ నే చంపేయాలనుకున్నాడు. దాని కోసం ఏకంగా కరోనా సోకిన వ్యక్తి నుంచి ఉమ్మిని ప్రత్యేకంగా కొన్నాడు. ఆ తర్వాత ఆ ఉమ్మిని బాస్ తాగే కూల్ డ్రింక్ లో కలిపాడు. అంతే కాదండోయ్ ఆ తర్వాత బాస్ ఆఫీసుకు తెమ్మని ఇచ్చిన 22 లక్షల రూపాయలతో ఎస్కేప్ అయ్యాడు. టర్కీలో జరిగిన ఈ ఘటన నెట్టింట కలకలం రేపుతోంది. చంపడానికి ఇలాంటి టెక్నిక్ లు కూడా వాడుతున్నారా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
టర్కీలోని ఆడనా ప్రాంతంలో ఇబ్రహీం ఉన్వేర్దీ అనే వ్యక్తికి కారు డీలర్ షిప్ వ్యాపారం ఉంది. అతడి కింద రమజాన్ సైమెన్ అనే వ్యక్తి మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. కారణం ఏమిటో ఏమో కానీ సైమెన్ తన యజమాని కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. ఇటీవల ఓ కారును అమ్మితే 22 లక్షల రూపాయలు వచ్చాయి. వాటిని ఆఫీసుకు తీసుకురమ్మని సైమెన్ కు ఇబ్రహీం ఇచ్చాడు. అయితే ఆ డబ్బులతో సైమెన్ ఎస్కేప్ అయ్యాడు. ఫోన్ చేస్తే ఎంతకూ స్పందించలేదు. మరుసటి రోజు యజమానికి ఫోన్ చేసి ఆ డబ్బులు తనకు అవసరం అనీ, వాటితో గతంలో తాను తీసుకున్న లోన్ ను తీర్చేశానని చెప్పుకొచ్చాడు. దీంతో అతడు గతంలోనూ చేసిన నిర్వాకాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
’నేను అతడిని ఎంతగానో నమ్మాను. నా లాకర్ పాస్ వర్డ్ లు కూడా అతడికి తెలుసు. అంతగా మాలో అతడు మెలిగాడు. గతంలో నన్ను, నా భార్యను చంపేందుకు ప్రయత్నించాడు. కరోనా సోకిన వ్యక్తి నుంచి ఉమ్మిని ఐదు వేల రూపాయలకు కొన్నాడు. దాన్ని మేము తాగే కూల్ డ్రింక్ లో కలిపాడు. ఆఫీసులోని ఓ వ్యక్తి నాకు పంపిన సమాచారం వల్ల ఆ కూల్ డ్రింక్ ను మేము తాగలేదు. ఈ విషయం తెలిసి నా భార్య వణికిపోయింది. పిల్లలతో కలిసి బయటకు రావాలంటేనే భయపడుతోంది. ఇప్పుడు మళ్లీ 22 లక్షల రూపాయలతో ఎస్కేప్ అయ్యాడు. పోలీసులు అతడిని వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను‘ అని ఇబ్రహీం తెలిపాడు. ఈ ఘటనపై టర్కీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సైమెన్ కోసం గాలిస్తున్నారు.