ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi liquor scam)కేసులో దేశ రాజధాని హస్తినలో తీగ లాగితే తెలుగు రాష్ట్రాల్లో డొంక కదులుతోంది. ఈకేసులో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పెద్దల పేర్లు వినిపిస్తుండగా తాజాగా ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి(Magunta Srinivasulureddy)కుమారుడు రాఘవరెడ్డి
(Raghava Reddy)ని అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్‌లో ఎంపీ తనయుడు కీలక భాగస్వామిగా ఉన్నట్లు తేలడంతో 10రోజుల పాటు కస్టడీకి విధించారు. అంతే కాదు ఈడీ edరిమాండ్ రిపోర్ట్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Kejriwal), బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kalvakuntla kavitha)పేర్లను చేర్చారు. ఇంకా ఈకేసులో ఎవరెవరిని పేర్లు బయటకు రానున్నాయో అనే విషయం రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది.
రిమాండ్ రిపోర్ట్‌లో పెద్దల పేర్లు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో స్పీడు పెంచారు సీబీఐ, ఈడీ అధికారులు. ఇప్పటికే ఏపీకి చెందిన వైసీపీ లోక్‌సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడ్ని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు శనివారం కోర్టులో హాజరుపరిచారు. ఈడీ అధికారులు కోర్టుకు నివేదించిన ఈడీ రిపోర్టులో సంచలన విషయాలను పొందుపరిచారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎంపీ తనయుడు రాఘవరెడ్డి కీలక వ్యక్తిగా చూపించారు. దీంతో కోర్టు 10రోజుల కస్టడీ విధించింది. సుమారు 180కోట్ల నేరపూరితమైన ఆర్ధిక లావాదేవీల్లో రాఘవరెడ్డి పాత్ర ఉందని పేర్కొంది. హోల్‌సేల్ కంపెనీ ఇండోస్పిరిట్‌లో రాఘవరెడ్డి ఒక భాగస్వామిగా చూపించింది. అంతే కాదు మాగుంట ఆగ్రోఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రెండు రిటైల్ జోన్స్ ఉన్నట్లుగా కూడా రిమాండ్ రిపోర్ట్‌లో వివరించింది ఈడీ.
10రోజుల కస్టడీ..
ఈకేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు సౌత్ గ్రూప్ 100కోట్లు ఇచ్చినట్లుగా ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్‌లో కొన్ని పార్టీలకు చెందిన కీలక నేతల పేర్లను చేర్చింది. బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత , వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ, శరత్‌చంద్రారెడ్డి ఉన్నట్లుగా తెలిపింది. ఇక రిమాండ్ రిపోర్ట్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కవిత పేర్లను నమోదు చేసింది.
డొంక కదులుతోందా..?
ఇండోస్పిరిట్ సంస్థలో కవిత ప్రతినిధిగా అరుణ్ పిళ్లై వ్యవహరించాడని, అరుణ్ పిళ్లైని విచారించిన సమయంలో మాగుంటకు సంబంధించిన విషయాలు వెల్లడయ్యాయని పేర్కొంది. కేజ్రీవాల్‌ను మాగుంట శ్రీనివాసులురెడ్డి కలిసినట్టు అరుణ్ పిళ్లై వాంగ్మూలం ఇచ్చినట్లుగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈకేసులో 10మందిని అరెస్ట్ చేశారు. ఈకేసులో ప్రస్తుతం రాఘవరెడ్డిని 10రోజుల కస్టడీకి అనుమతించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aravind Kejriwal, Delhi liquor Scam, Kalvakuntla Kavitha, Ycp