ఉత్తరప్రదేశ్ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారనే ఆరోపణలపై హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆయనపై కేసు నమోదుకు ఆదేశించి, ప్రచారంపై నిషేధం విధించింది.
ఉత్తరప్రదేశ్ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారనే ఆరోపణలపై హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం శనివారం నాడు తెలంగాణ ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అంతేకాదు, యూపీలో రాజా సింగ్ ఎన్నికల ప్రచారాన్ని కూడా ఈసీ నిషేధించింది.
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాబోయే 72 గంటల పాటు ఎన్నికల సభలు, సమావేశాలు, మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని కూడా ఈసీ నిషేధం విధించింది. ఉత్తర ప్రదేశ్లో బీజేపీకి ఓటు వేయనివారి ఇళ్లను కూల్చడానికి జేసీబీలు, బుల్డోజర్ల సిద్ధంగా ఉన్నాయంటూ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ ఆదేశించినా, రాజాసింగ్ ప్రతిస్పందించలేదు. దీంతో ఆయపై కేసు నమోదుకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారం నిమిత్తం తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇటీవల విడుదల చేసిన వీడియో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. యూపీలో యోగికి, బీజేపీకి ఓటు వేయకపోతే బుల్డోజర్లతో తొక్కించేస్తామని రాజా సింగ్ ఓటర్లను బెదిరించారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో రాజా సింగ్కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఐపీసీ, ఆర్పీ చట్టం, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కానీ గడువులోగా ఆయన సమాధానం ఇవ్వకపోవడంతో చివరికి కేసు నమోదుకు ఆదేశాలు వెలువడ్డాయి.
అతిపెద్ద రాష్ట్రం యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తి కాగా, మూడో దశ పోలింగ్ ఆదివారం(ఫిబ్రవరి 20న) జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.