హోమ్ /వార్తలు /క్రైమ్ /

Hyderabad: నిర్మానుష్య ప్రాంతంలో ఏకాంతంగా ఓ వివాహితతో ఉన్న కుర్రాడికి షాకింగ్ అనుభవం.. పోలీసు శాఖలోనూ కలకలం.. అసలేం జరిగిందంటే..!

Hyderabad: నిర్మానుష్య ప్రాంతంలో ఏకాంతంగా ఓ వివాహితతో ఉన్న కుర్రాడికి షాకింగ్ అనుభవం.. పోలీసు శాఖలోనూ కలకలం.. అసలేం జరిగిందంటే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ కుర్రాడు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చి ఓ హాస్టల్ లో ఉంటున్నాడు. తన ప్రేయసి అయిన ఓ వివాహిత కూడా హైదరాబాద్ లోనే ఉంటోంది. ఇద్దరూ ఏకాంతంగా కలుసుకోవాలనుకున్నారు. అదే వారికి ఓ పెద్ద షాకింగ్ అనుభవాన్ని ఇచ్చింది.

హైదరాబాద్ సిటీకి ఉపాధి కోసం వచ్చాడో కుర్రాడు. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తన ప్రేయసి కూడా నగరంలోనే ఉంటోంది. ఇద్దరూ కలుసుకోవాలనుకున్నారు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఏకాంతంగా కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఇది కాస్తా ఓ కానిస్టేబుల్, ఎస్పీవో (స్పెషల్ పోలీస్ ఆఫీసర్) కంట పడింది. వాళ్లను బెదిరించి భయపెట్టి రెండు ఉంగరాలను అతడి నుంచి లాక్కున్నాడు. చివరకు ఆ ఘటనే పోలీసు శాఖలో ఓ కలకలాన్నే సృష్టించింది. భారీ హైడ్రామాకు కారణమయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ కుర్రాడు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చి ఓ హాస్టల్ లో ఉంటున్నాడు. తన ప్రేయసి బంధువురాలు అయిన ఓ వివాహిత ఐదు నెలల క్రితం నుంచి హైదరాబాద్ లోనే ఉంటోంది. ఇద్దరూ ఏకాంతంగా కలుసుకోవాలనుకున్నారు. దీంతో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్ పల్లిలోని వెంచర్ లోకి వెళ్లారు.

వాళ్లిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలోనే అటువైపుగా ఓ కానిస్టేబుల్, స్పెషల్ పోలీసు అధికారి వచ్చారు. ఆ జంటను చూశారు. వారిని బెదిరించారు. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే మీ పరువే పోతుందని భయపెట్టారు. డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో ఆ కుర్రాడు తన వద్ద డబ్బు లేదని చెప్పి రెండు ఉంగరాలను మాత్రం ఇచ్చాడు. ఆ వివాహితను పంపించేశాడు. అతడు కూడా అక్కడి నుంచి వచ్చేశాడు. కొద్ది దూరం వెళ్లగానే అతడికి డయల్ 100 వాహనం కనిపించింది. దీంతో తనకు జరిగిన సాకింగ్ అనుభవాన్ని దాంట్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ కు పూసగుచ్చినట్టు చెప్పాడు. దీంతో తాను పనిచేసే దుండిగల్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు ఆ హెడ్ కానిస్టేబుల్ బాధిత యువకుడిని స్టేషన్ కు తీసుకెళ్లారు. కానిస్టేబుల్, ఎస్పీవోపై ఫిర్యాదు చేయాలని సూచించారు.

’కేసుల్లాంటివి ఏమీ వద్దు. నా ఉంగరాను నాకు ఇప్పిస్తే చాలు‘ అని ఆ కుర్రాడు చెప్పినా ఒప్పుకోలేదు. దీంతో ఆ కుర్రాడు కేసు పెట్టక తప్పలేదు. దీని ఫలితంగా నిర్వాకానికి పాల్పడ్డ కానిస్టేబుల్ పై కేసు నమోదయింది. ఎస్పీవోను విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన నాలుగు నెలల క్రితం జరిగింది. వారం రోజుల పాటు జైల్లోనే ఉన్న కానిస్టేబుల్ బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈ కేసు నుంచి బయటపడేందుకు తన ఊరి వాడైన దుండిగల్ స్టేషన్ లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ సాయం తీసుకున్నాడు. వీళ్లిద్దరూ కలిసి ఇన్ స్పెక్టర్, ఎస్సైకి తెలియకుండానే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పై ఒత్తిడి తెచ్చారు. తమకు సహకరించేలా చూడమన్నారు. ఇదే సమయంలో కుర్రాడిని కూడా తమ వైపునకు తిప్పుకున్నారు. ఫలితంగా ఆ ఉంగరాలు ఎక్కడో పోయాయనీ, వీళ్లకు తనకు సంబంధం లేదని కోర్టులో ఆ కుర్రాడు చెప్పుకొచ్చాడు. దీంతో ఈ కేసును కోర్టు కొట్టేసింది. వాస్తవానికి ఎవరైనా పోలీసుపై కేసు పెడితే శాఖా పరంగా విచారణ జరుగుతుంది.

ఈ కేసు విషయంలో కూడా శాఖా పరంగా విచారణను స్టార్ట్ చేశారు. అయితే ఆ కుర్రాడు వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించాడు. ఈ విషయాన్ని ఏసీపీ బాలానగర్ డీసీపీకి తెలిపారు. ఆయన సైబరాబాబ్ సీపీ సజ్జనార్ కు వివరించారు. అదే సయమంలో కేసును కూడా కోర్టు కొట్టేసిందని సీపీకి తెలిసింది. దీంతో అసలేం జరిగిందో గ్రహించి ఈ నిర్వాకానికి పాల్పడిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పై చర్యలకు లేఖ రాశారు. ఇన్ స్పెక్టర్, ఎస్సైలను కమిషనరేట్ కు అటాచ్ చేస్తూ నిర్ణయించారు. కేసును మళ్లీ రీ ఓపెన్ చేయించి, కానిస్టేబుల్ కు శిక్ష పడేలా చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మొత్తానికి ఓ కుర్రాడు, అతడి ప్రేయసి ఏకాంత ముచ్చట్లు పోలీసు శాఖలో పెద్ద అలజడినే సృష్టించిందన్నమాట.

First published:

Tags: Crime news, Crime story, CYBER CRIME, Hyderabad, Lovers, Telangana

ఉత్తమ కథలు