జంతువులకు రక్షణ లేకుండాపోయింది.. అడవుల్లోనే కాదు.. జూపార్కుల్లో కూడా! కృరమృగాలే అయినా స్వభావానికి విరుద్ధంగా బోనుల్లో బందీలుగా వినోదాన్ని పంచుతోన్న జీవాలనూ మనుషులు వదట్లేదు. మన హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ప్రఖ్యాత నెహ్రూ జూలాజికల్ పార్కులో మంగళవారం నాడు ఓ యువకుడు హద్దుమీరి సింహంతో చెలగాటం ఆడాడు. ఆ దృశ్యాలు చూసి పార్కులో మహిళలు, పిల్లలు, పెద్దలు పెద్దపెట్టున కేకలు వేశారు. కాలు రెండంగులాలు పట్టు తప్పి ఉంటే అతను ఈ పాటికి సింహానికి ఆహారమైపోయేవాడు. ఠారెత్తించే ఘటనకు సంబంధించి ప్రస్తుతం వీడియో వైరల్ (Viral Video) గా మారింది. జూపార్క్ సిబ్బంది, బహదూద్ పురా పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..
హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూ పార్కులో మంగళవారం ఓ యువకుడు ఓవరాక్షన్ చేశాడు. ఆఫ్రికన్ సింహం ఎంక్లోజర్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. ఫెన్సింగ్ దూకిమరీ లోపలికి ప్రవేశించిన ఆ యువకుడు.. సింహానికి కేవలం ఐదారు అడుగుల ఎత్తులో నిలబడి రెచ్చగొట్టాడు. ప్రశాంతంగా అటు ఇటూ తిరుగుతోన్న సింహం.. వీడి చర్యలకు విసిగెత్తినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఒక దశలో వాణ్ని నోట కరిచేందుకు సింహం పైకి ఎగిరే ప్రయత్నం చేసింది..
నెహ్రూ జూపార్క్ లో ఆఫ్రికా సంహం ఎంక్లోజర్ లోకి యువకుడు ప్రవేశించడం కలకలం రేపింది. యువకుడు సింహానికి దగ్గరగా వెళ్లడం చూసి బయటున్నవారంతా కేకలు పెట్టారు. దీంతో జూసిబ్బంది పరుగున వచ్చి వాణ్ని సింహానికి బలైపోకుండా కాపాడారు. అనంతరం బహదూర్ పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింహంతో చెలగాటమాడిన యువకుడిని జి.సాయికుమార్(31)గా గుర్తించామని, మద్యం మత్తులోనే అతనీ చర్యకు పాల్పడ్డాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బహదూర్ పురా పోలీసులు తెలిపారు.
G Sai Kumar(31) was walking vulnerably on the boulders of the African Lion moat area, where the lions are released in the exhibited enclosure at Nehru Zoological Park, #Hyderabad. He was rescued and caught by the zoo staff and handed over to the Bahadurpura Police station. pic.twitter.com/k5KbuFP0MW
— Sumit Jha (@sumitjha__) November 23, 2021
నెహ్రూ జూపార్క్ లో సింహాలతో మనుషులు చెలగాటానికి దిగడం ఇది కొత్తేమీ కాదు, గతంలోనూ పలు మార్లు యువకులు వెర్రి సాహసాన్ని ప్రదర్శించేందుకు సింహం ఎంక్లోజర్లలోకి దూకిన సందర్భాలున్నాయి. అయితే ప్రతిసారి జూ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ యువకులను కాపాడుతూ వచ్చారు. ఇవాళ కూడా సాయికుమార్ ను కాపాడింది జూ సిబ్బందే. కాగా, సింహాలకు రక్షణ విషయంలో అధికారులు అదనపు చర్యలు చెపట్టాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.