Drone bomb attack: మావోయిస్టుల అణచివేతలో కొత్త పంథా మొదలైందా..? ఎయిర్ డ్రోన్ల ద్వారా పోలీసులు బాంబు దాడికి పాల్పడ్డారా..? దండకారణ్యంలోని మావోయిస్టుల ఏరివేతలో భాగంగా చేపట్టిన ఆపరేషన్ ప్రహార్‌ను విస్త్రుతం చేస్తూ పోలీసులు తమపై డ్రోన్ ల ద్వారా బాంబులు కురిపించారని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి వికల్ప్ లేఖ విడుదల చేశారు.
(జి.శ్రీనివాసరెడ్డి, న్యూస్18 తెలుగు, ఖమ్మం జిల్లా ప్రతినిధి)
ఏప్రిల్ 19వ తేదీన చత్తీస్‌ఘడ్‌లోని బీజపూర్ జిల్లా పామేడు పోలీసుస్టేషన్ పరిధిలోని గ్రామాలైన బొత్తలంక, పాలగూడెం సరిహద్దుల్లో ఈ దాడులు జరిగినట్టు వికల్ప్ తన లేఖలో పేర్కొన్నారు. ఇలా మొత్తం పన్నెండు బాంబులను డ్రోన్ల ద్వారా జారవిడిచారని.. ఈ దాడిని అందరూ ఖండించాలని వికల్ప్ కోరారు. లేఖతో పాటు దాడికి సంబంధించినఫ ఫొటోలు, వీడియో ఫుటేజిని రిలీజ్ చేశారు. అయితే దీనిపై స్పందించిన బస్తర్ ఐజీ సుందర్రాజ్ మాత్రం మావోల ఆరోపణలను ఖండించారు. తాము స్థానిక ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నామని.. మన్యంలో మావోలు సాగిస్తున్న అరాచకాలు, అమాయక గిరిజనాన్ని అడ్డుపెట్టుకుని మావోలు సాగిస్తున్న దౌర్జన్యాలను తీవ్రంగా ఖండించారు. ఎక్కడంటే అక్కడ ఐఈడీ బాంబులను అమర్చి అమాయకుల ప్రాణాలను తీస్తున్నది ఎవరంటూ ఐజీ సుందర్రాజ్ ఎదురు ప్రశ్నించారు. ఇలా మావోయిస్టుల ఆరోపణలు, పోలీసు అధికారుల ప్రత్యారోపణలతో పరిస్థితి గందరగోళంగా మారింది. అసలు అక్కడ ఏంజరుగుతోందన్న దానిపై ఎవరికీ స్పష్టత లేని పరిస్థితి తయారైంది. ఆపరేషన్ ప్రహార్‌లో భాగంగా కూంబింగ్ జరుపుతున్న సీఆర్పీఎఫ్ బృందాలకు.. ఫలానా ప్రాంతంలో మావోయిస్టుల టాప్ క్యాడర్ తలదాచుకుందున్న సమాచారం అందడంతో పోలీసు బలగాలు ఈ నెల 3వ తేదీన బీజపూర్ జిల్లా తొర్రెం- జొన్నగూడ అటవీ ప్రాంతంలో భారీ సంఖ్యలో వెళ్లి కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో అప్పటికే వ్యూహంలో భాగంగా అక్కడ మోహరించిన మావోయిస్టులు పోలీసులపై విరుచుకుపడ్డారు.
ఈ ఘటనలో 23 మంది జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాడి అనంతరం ఒక జవాన్‌ను బందీగా పట్టుకెళ్లారు. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సీఆర్పీఎఫ్ బలగాలపై దాడిని తీవ్రంగా ఖండించారు. దీనికి ధీటైన జవాబు చెబుతామని ప్రకటించారు. దీంతో ఇది కేంద్ర హోంమంత్రి ప్రకటనలో భాగంగానే తమపై డ్రోన్ల ద్వారా బాంబులను జారవిడిచి ఉంటారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. తమ దాడికి ప్రతీకారంగానే ప్రభుత్వం ఇలాంటి ప్రతి దాడులకు దిగుతోందని, ఇలాంటి బాంబు దాడుల వల్ల మన్యంలో విలువైన వృక్ష సంపద, జంతు సంతతి నశిస్తోందని ఆరోపించారు. పోలీసులలో నైతిక స్థైర్యాన్నినింపడం.. చత్తీస్‌ఘడ్‌లో ఉన్న మైనింగ్ కాంట్రాక్టర్లకు మేలు చేయడానికే తమపై ఆకాశ దాడులకు తెగబడుతున్నారని మావోలు ఆరోపిస్తున్నారు.
ఆకాశ దాడి నిజమేనా.. అసలు సాధ్యమేనా..?
మావోయిస్టుల ఆరోపణలను తీవ్రంగా ఖండించిన బస్తర్ ఐజీ సుందర్రాజ్ తాము సామాన్య ప్రజల జీవితాలకు భరోసా ఇవ్వడానికే కూంబింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. అయితే ఈ ఆరోపణలు.. ప్రత్యారోపణలు ఎలా ఉన్నా.. ఇలా ఆకాశ దాడులకు దిగే పరిస్థితి అసలు ఉందా..? ఉంటే సాంకేతికంగా ఇది సాధ్యమేనా..? అన్న అనుమానాలు ముప్పిరిగొంటున్నాయి. నిజానికి గతేడాది నుంచి థిక్ ఫారెస్టులో మావోయిస్టుల ఉనికి, కదలికలను పసిగట్టడానికి ఉద్దేశించి పోలీసులు డ్రోన్ కెమెరాలను వాడుతున్నారు. అయితే వీటి సామర్థ్యంపై పరిమితులున్నాయి. భూమి నుంచి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల మేర ఎత్తులో ఎగిరే శక్తి ఉన్న ఈ డ్రోన్లకు.. పది కిలోమీటర్ల మేర ప్రయాణించే శక్తి ఉంది. కేవలం నిఘా సంబంధిత సమాచారాన్ని సేకరించే ఉద్దేశంతో రూపొందించిన ఈ డ్రోన్లకు బాంబులను క్యారీ చేసే సామర్థ్యం ఉండదంటున్నారు. అందువల్ల ఇప్పటికే పోలీసులు వినియోగిస్తున్న డ్రోన్లు బాంబు దాడికి పనికొచ్చే పరిస్థితి లేదన్న విషయం తేటతెల్లమవుతోంది. ఇవి కాకుండా ఆధునిక డ్రోన్లను ఏమైనా ఉపయోగించి.. మావోయిస్టులు ఆరోపించినట్టు బాంబు దాడులు చేశారా అంటే.. దీనికి కూడా చాలా పరిమితులు ఉన్నట్టు చెబుతున్నారు. దీనికి అవసరమైన సాంకేతికత స్థానికంగా అందుబాటులో లేదని.. బీజపూర్‌కు 389 కిలోమీటర్ల దూరంలోని బిలాయ్.. లేదా 189 కి.మీ దూరంలోని జగదల్పూర్.. లేదా 301 కి.మీ దూరంలో ఉన్న హైదరాబాద్‌ల నుంచి మాత్రమే డ్రోన్ల దాడిని నియంత్రించే వ్యవస్థ అందుబాటులో ఉందంటున్నారు.
చత్తీస్‌ఘడ్‌లోని కొన్ని జిల్లాలలో జనతనసర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న మావోయిస్టులను అదుపు చేయడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం.. అటు కేంద్ర ప్రభుత్వం.. ఇంకా బాధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సంయుక్తంగా బలగాలను నియోగిస్తున్నా.. గెరిల్లా వార్ఫేర్లో నైపుణ్యం సాధించిన మడవి హిడ్మా లాంటి మావోయిస్టు కమాండర్ దాడులను అడ్డుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా చత్తీస్‌ఘడ్‌లోని బీజపూర్, దంతెవాడ, సుక్మా, కాంకేర్, నారాయణ్‌పూర్ జిల్లాల్లో మావోయిస్టులకు చెక్ పెట్టలేకపోతున్నారన్న అపవాదు మోస్తున్నారు. దీనికోసమే గతేడాది కిల్లర్ వీరప్పన్‌ను ఏరివేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి, కేంద్ర గృహమంత్రిత్వ శాఖకు సీనియర్ సలహాదారు కె.విజయ్‌కుమార్ నేతృత్వంలో ఐదు రాష్ట్రాల పోలీసు చీఫ్‌లు సమావేశమైనా పెద్దగా ఆశించిన ఫలితం రాలేదన్న భావన ఉంది. మావోయిస్టులపై మరింత ఉధృతంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉందన్న భావన తెర్రెం మారణకాండ అనంతరం పోలీసుల్లో ఏర్పడింది. మొత్తానికి ఆధిపత్యపోరులో మన్యం మాత్రం వణుకుతోంది. రక్తసిక్తమవుతున్న దండకారణ్యంలో ఆదివాసీల బతుకుల్లో అశాంతి రాజ్యమేలుతోంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.