రోజురోజూకీ మానవత్వ విలువలు మంటగలుస్తున్నాయి. దీనికితోడు స్మార్ట్ ఫోన్ వినియోగం.. సోషల్ మీడియా ప్రభావంతో పక్కవారి కళ్లముందే చనిపోతున్నా.. రక్షించాల్సింది పోయి వీడియోలు తీస్తూ, సెల్ఫీలు దిగుతూ వికృతానందం పొందుతున్నారు. అలాంటి ఘటన ఒకటి తాజాగా ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ జిల్లా హోల్దేల్పూర్ గ్రామంలో జామ్వతి(62) అనే వృద్ధురాలు నివసిస్తోంది. ఆమె భర్త మూడేళ్ల క్రితమే చనిపోగా, జామ్వతి ఒంటరిగానే నివసిస్తోంది. గురువారం మధ్యాహ్నాం సమయంలో ఇంటి ఆరుబయట కూర్చున్న జామ్వతిపై పక్కింటికి చెందిన మోను అనే దివ్యాంగుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. వృద్ధురాలు బిగ్గరగా అరుస్తూ కిందపడింది. అయినా మోను ఆగకుండా వృద్ధురాలిపై కాల్పులు జరుపుతూనే ఉన్నాడు.
ఇదంతా చూస్తున్న ఓ వ్యక్తి వృద్ధురాలిని కాపాడకుండా తన మొబైల్లో వీడియో తీశాడు. ఈలోపే గమనించిన స్థానికులు జామ్వతిని ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయింది. సమాచారం అందుకున్న ఏఎస్పీ పవిత్రమోహన్ ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుడు మోను వేరే ఇంటిలో దాక్కున్న విషయం తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. అయితే సదరు నిందితుడు మోను వృద్ధురాలి ఇంటిని లాక్కోవాలనే ఉద్దేశంతో ఈ పని చేసినట్టు ఏడీజీ అజయ్ ఆనంద్ పేర్కొన్నారు. ఇదిలావుంటే.. వృద్ధురాలిని కాపాడాల్సింది పోయి వీడియో తీస్తూ వికృతానందాన్ని పొందిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gun fire, Telangana, Uttar pradesh