Disha Gang Rape and Murder Case: తెలుగు రాష్ట్రాలతోపాటూ... దేశం మొత్తాన్నీ కదిలించిన ఘటన అది. మరోసారి అత్యాచారాలపై దేశం మొత్తం రగిలిపోయిన సందర్భం అది. ఇన్‌స్టంట్ జస్టిస్ కావాలని లక్షల మంది డిమాండ్ చేయగా... ఆ సందర్భంలో జరిగిన ఎన్‌కౌంటర్... మరో చర్చకు దారి తీసింది. ఎన్‌కౌంటరే సరైన పరిష్కారం అని చాలా మంది భావించగా... రేప్ కేసుల్లో నిందితులు అందర్నీ ఇలాగే శిక్షిస్తారా అని మరికొందరు పోలీసులను ప్రశ్నించారు. అది నిజమైన ఎన్‌కౌంటరా లేక... బూటకపు ఎన్‌కౌంటరా తేల్చాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి. అసలు ఏం జరిగిందో మరోసారి తెలుసుకుందాం. పోలీసులు ఎన్‌కౌంటర్ ఎందుకు చేశారో, ఏమన్నారో... అసలు దిశ గ్యాంగ్ రేప్ కేసేంటో... క్లారిటీగా తెలుసుకుందాం.
రాత్రి వేళ అరాచకం:
అది 2019 నవంబర్ 27. ఉదయం 8.30 టైమ్‌లో తన స్కూటీని శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి టోల్‌ప్లాజా దగ్గర నేషనల్ హైవే పక్కన ఆపి పని మీద వెళ్ళిన 26 ఏళ్ల దిశ... నలుగురు దుర్మార్గుల కంట పడింది. రాత్రి తిరిగి వచ్చిన దిశ తన స్కూటీని తీసుకొని ఇంటికి వెళ్లబోయింది. అప్పటివరకూ ఆమె కోసం ఎదురుచూసిన ఆ నలుగురూ ఆమెను బలవంతంగా ఎత్తుకుపోయారు. ఓ పాత ప్రహరీ పక్కకు తీసుకెళ్ళి గ్యాంగ్ రేప్ చేసారు. తర్వాత ఆమె ప్రాణాలు తీశారు. ఆమెను అర్ధర్రాతి లారీలో తీసుకెళ్ళి షాద్‌నగర్ శివారులోని చటాన్‌పల్లి బైపాస్ వంతెన కింద దహనం చేశారు. డిసెంబర్ 28న తెల్లారి ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రతి ఒక్కరినీ కదిలించింది. అదే రోజు రాత్రి నిందితులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎన్‌కౌంటర్ డిమాండ్:
పోలీసులు నిందితులను నవంబర్ 29న షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. వారిని ఎన్‌కౌంటర్ చేయాలని వేల మంది ప్రజలు పోలీస్‌స్టేషన్ ముందు ధర్నా చేశారు. తమకు అప్పగిస్తే తామే చంపుతామన్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. లాఠీ చార్జీ జరిగింది. అదే రోజు నిందితులను తహిసీల్దార్ ముందుంచారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు నిందితులను భారీ బందోబస్తు మధ్య షాద్‌నగర్ నుంచి చర్లపల్లి జైలుకు తీసుకెళ్లారు. తర్వాత పోలీసులు కస్టడీకి కోరడంతో డిసెంబర్ 3న కోర్టు 10 రోజుల కస్టడీకి ఇచ్చింది. హంతకులు వాడిన లారీలో ఆధారాలను డిసెంబర్ 5న సేకరించారు. డిసెంబర్ 6 తెల్లవారు జామున నలుగురు నిందితులనూ సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం పోలీసులు చటాన్‌పల్లి బ్రిడ్జి దగ్గరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నిందితులనూ పోలీసులు కాల్చి చంపారు.
ఇదీ పోలీసుల వెర్షన్:
ప్రజల్లో ఆగ్రహావేశాలు ఉన్నాయి కాబట్టి... సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం తెల్లవారు జామునే నిందితులను అక్కడికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు తమ దగ్గర నుంచి ఆయుధాలను లాక్కొని... తమపై కాల్పులు జరపబోతుంటే... ఆత్మరక్షణలో భాగంగా తామూ కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు అక్కడికక్కడే చనిపోయారు.
మానవ హక్కుల డిమాండ్లు:
డిసెంబర్ 7న ఢిల్లీ నుంచి మానవహక్కుల కమీషన్ బృందం దిశను ఆహుతి చేసిన ప్రాంతాన్ని, నిందితులు ఎన్‌కౌంటర్ జరిగిన స్ధలాన్ని పరిశీలించింది. డిసెంబర్ 9న ఎన్‌కౌంటర్ ప్రదేశాన్ని క్లూస్‌టీం 3డీ స్కానర్‌తో చిత్రీకరించింది. 8 మంది సభ్యుల క్లూస్‌టీం చటాన్‌పల్లి బ్రిడ్డి దగ్గరా పరిశీలించింది. డిసెంబర్ 23న ఎన్‌కౌంటర్ అయిన మృతదేహాలకు హైకోర్టు ఆదేశాలతో రీపోస్టుమార్టం జరిపారు. తర్వాత వాటిని వారి కుటుంబ సభ్యులకు ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యులు న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా... ఆ కమిటీ సభ్యులు విచారణ కోసం జనవరిలో హైదరాబాద్ వచ్చారు. ఆ విచారణ అలా కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి:Husband kills wife: టైముకి భోజనం పెట్టలేదని భార్యను చంపిన భర్త...
ఎన్నో మార్పులకు శ్రీకారం:
దేశాన్ని కదిలించిన ఈ ఘటనతో... చట్టాలను మరింత కఠినతరం చేశారు. మహిళల రక్షణకు మరిన్ని చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక యాప్‌లు తెచ్చారు. పెట్రోలింగ్ పెంచారు. దిశ ఘటన తర్వాత... తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దారుణాలు కాస్త తగ్గాయి. అయినప్పటికీ... అప్పుడప్పుడూ జరుగుతూనే ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.