సాగర్ దండక్ (Sagar Dhandak) హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ (Wrestler Susheel Kumar) ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. హత్య కేసుకు సంబంధించి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం చేసిన ఏ ఒక్కరినీ వదలకుండా విచారిస్తున్నారు. సుశీల్ కుమార్ పట్టుబడే సమయానికి ఒక స్కూటర్ (Scooter) ఉపయోగిస్తున్నాడు. సుశీల్, అతడి స్నేహితుడు అజయ్ కలసి ఆ స్కూటర్ మీద వస్తుండగా ఢిల్లీ పోలీసులు (Delhi Police) అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆ స్కూటర్ యజమానికి కూడా పోలీసులు విచారణకు పిలిచారు. ఆ స్కూటర్ ఒక మహిళదని తేలింది. సుశీల్ కుమార్ ఒక హత్య కేసులో నిందితుడు, అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిసినా తన బైక్ ఎలా ఇచ్చిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఆమెకు హత్య గురించి తెలిసి.. పోలీసులకు విషయం దాచి పెట్టి ఉంటే మాత్రం.. సదరు మహిళపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుందని ఢిల్లీ పోలీసు వర్గాలు అంటున్నాయి. త్వరలోనే ఆమెను ఢిల్లీ పోలీసులు విచారించి పూర్తి వివరాలు సేకరించనున్నాయని సీనియర్ విచారణ అధికారి చెప్పారు. మే 4న చత్రాసాల్ స్టేడియంలో సాగర్ దండక్, సోనూ, ఇంకో వ్యక్తిపై సుశీల్, అతడి అనుచరులు బ్యాట్లతో దాడి చేశారు. ఈ దాడి అనంతరం చికిత్స పొందుతూ సాగర్ దండక్ మృతి చెందగా.. సోను తీవ్రగాయాలపాలయ్యాడు.
మరోవైపు సుశీల్ కుమార్ కుడి భుజంగా వ్యవహరిస్తున్న అజయ్ కుమార్ చరిత్రపై కూడా విచారిస్తున్నారు. అజయ్ కూడా జాతీయ స్థాయిలో రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. అనంతరం స్పోర్ట్స్ కోటాలో ఢిల్లీ పరిధిలోని ఒక స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. అతడు స్కూల్‌కు వచ్చే సమయం కంటే ఎక్కువగా సుశీల్ కుమార్ దందాలను చూడటం తోనే గడిపేవాడని సన్నిహితులు తెలియజేశారు. సాగర్ దండక్ హత్యానంతరం సుశీల్‌తో కలసి అజయ్ కూడా పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు వెంటనే ఢిల్లీ విద్యాశాఖ అధికారులకు లేఖ రాశారు. అజయ్ కుమార్‌పై వెంటనే శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు సుశీల్, అజయ్ హత్య అనంతరం ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరితో కలిశారు. ఇన్ని రోజు వాళ్లు పోలీసుల కళ్లగప్పి తప్పించుకొని తిరగడానికి ఎవరెవరు సహాయం చేశారనే దానిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. హరిద్వార్‌లోనే ఎక్కువ రోజులు ఎలా గడిపారనే దానిపై కూడ ఆరా తీస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం గతంలో వార్తలు వచ్చినట్లు ఒక యోగా గురువు ఆశ్రమంలో అతడు తలదాచుకున్నది నిజమేనని తెలుస్తున్నది. ఆ దిశగా కూడా విచారణ జరుగుతున్నది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi police, Murder, Susheel kumar, Wrestling