Delhi Murder : ఢిల్లీలో కాల్ సెంటర్ ఉద్యోగిని శ్రద్ధావాకర్ హత్య ఎంతటి సంచలనం రేపిందో మనకు తెలుసు. ఆమె ప్రియుడే ఆమెను చంపి.. 35 ముక్కలు చేసి.. వాటిని ఫ్రిజ్‌లో దాచి.. ఢిల్లీ శివార్లలో అక్కడక్కడా పడేయడం.. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అదే విధమైన మరిన్ని హత్యలు జరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి.. శ్రద్ధావాకర్ హత్య గురించి తెలుసుకొని.. ప్రేరణ పొంది.. ఆమె చంపేశాడు.
పాటియాలాకు చెందిన 45 ఏళ్ల మన్‌ప్రీత్ సింగ్.. పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్లో ఉండేవాడు. అతనికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కానీ భార్యతో చెడింది. ఆమెను వదిలేసి.. గణేశ్ నగర్ వచ్చాడు. అక్కడ 2015 నుంచి.. రేఖారాణితో సహజీవనం చేస్తున్నాడు.
మన్‌ప్రీత్ మంచివాడనుకున్న రేఖారాణి అతన్ని నమ్మింది. ఐతే.. కాలం గడిచేకొద్దీ అతను ఎలాంటి వాడో ఆమెకు తెలిసొచ్చింది. మన్‌ప్రీత్ పాత కార్లు కొని, అమ్మేవాడు. ఈ క్రమంలో అక్రమాలకు పాల్పడేవాడు. నకిలీ పత్రాలు సృష్టించి.. కార్లను ఎక్కువ ధరకు అమ్మేందుకు ప్రయత్నించేవాడు. ఈ విషయంపై తరచూ రేఖారాణితో గొడవ జరిగేది.
ఓసారి ఓ కిడ్నాప్, హత్యాయత్నం వ్యవహారంలో మన్‌ప్రీత్‌పై కేసు రాశారు పోలీసులు. ఆ కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. తాజాగా.. రేఖారాణితో మనస్పర్థలు ఎక్కువయ్యాయి. ఇంటికి వస్తే మనస్శాంతి లేదు. అతన్ని మంచిగా మార్చాలని రేఖ ఎంతగానో ప్రయత్నించినా.. మన్‌ప్రీత్ మారలేదు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రద్ధావాకర్ హత్య కేసును టీవీల్లో అదే పనిగా చూసీ చూసీ.. ప్రేరణ పొందాడు.
శ్రద్ధను హత్య చేసిన ఆఫ్తాబ్.. తాను బాధపడట్లేదనీ, తనకు ఏమాత్రం తప్పుగా అనిపించట్లేదని చెప్పడంతో.. ఆప్తాబ్ లాగానే తాను కూడా రేఖారాణిని వదిలించుకోవాలని అనుకున్నాడు. అందుకు ఆమెకు విషయం చెప్పి విడిపోయి ఉంటే సరిపోయేది. కానీ మన్‌ప్రీత్.. రేఖను చంపేస్తేనే తనకు మనస్శాంతి ఉంటుంది అనుకున్నాడు. తాజాగా ఆమెను కత్తితో పొడిచి చంపాడు. ఆమె దవడ, మెడ, చేతిపై కత్తిపోట్లు ఉన్నాయి. కుడిచేతి ఉంగరం వేలిని కోసేశాడు. స్థానికుల సమాచారంతో అతన్ని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, National News, VIRAL NEWS