గుడినే కాదు గుడిలో లింగాన్ని కూడా మాయం చేశారు. అనే సామెతను ఈ దొంగలు ఫాలో అయినట్టున్నారు. వినాయక చవితి రోజున నెల్లూరుజిల్లాలో పురాతన ఆలయంలోని ఓ వినాయక విగ్రహాన్ని దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. వివరాల్లో కెళ్తే... అనంతసాగరం మండలం, సోమశిలలో ఉన్న సోమేశ్వరాలయంలో శనివారం ఉదయం వందల ఏళ్ల నాటి వినాయక విగ్రహం మాయమైంది. సోమశిల జలాశయం వద్ద ఉండే ఈ దేవస్థానం ఎంతో పురాతనమైనది. శనివారం ఉదయం వినాయక చవితి కావడంతో అర్చకులు తెల్లవారు జామునే ఆలయాన్ని తెరిచి పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని దొంగలు భక్తుల ముసుగులో ఆలయంలోకి ప్రవేశించారు. పరమేశ్వరుణ్ని దర్శించి తర్వాత పూరతనమైన విఘ్నేశ్వరుని విగ్రహం వద్దకు వెళ్లారు. విగ్రహాన్ని పెకలించి గుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుండి తీసుకెళ్లిపోయారు. పూజ చేసేందుకు వచ్చిన భక్తులు అక్కడ వినాయక విగ్రహం లేకపోవడంతో పూజారికి విషయాన్ని తెలియజేశారు. చోరీ జరిగిందని గుర్తించిన అర్చకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల గురించి గాలింపు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Ganesh Chaturthi 2020