ఠాగూర్ సినిమా గుర్తుందా.. ఆసుపత్రిలో డెడ్‌బాడీకి వైద్యం చేయడం. ఏదో సీరియస్ అయిందని హడావుడి చేయడం. వెంటనే బిల్ కౌంటర్లో ట్రీట్మెంట్కి డబ్బులు చెల్లించాలని పురమాయించడం. చెల్లించాక.. అయ్యో మేం చాలా ప్రయత్నించాం. కానీ రక్షించలేకపోయాం. అంటారు. ఇంతకు ఇదెందుకు చెబుతున్నావ్ అంటారా; అచ్చం ఇలాంటి సీన్ రిపీటయింది మన తెలంగాణలో.. ఎక్కడంటారా? భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri kothagudem)లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో.. కాకపోతే బతికున్న వ్యక్తికి ట్రీట్మెంట్ చేస్తుంటే చనిపోయాడు. అప్పటికే పేషెంట్ బంధువులు చాలా డబ్బులు చెల్లించేశారు. దీంతో ఒకవేళ రోగి చనిపోయారని తెలిస్తే.. ఎక్కడ గడొవ చేస్తారోనని బయపడ్డారో.. లేక అది వాళ్ల రొటీన్లో భాగమూ తెలియదు కానీ, డ్రామా షురూ చేశారు. రోగి కండీషన్ సీరియస్‌గా ఉందంటూ.. వెంటనే పెద్దాసుత్రికి తీసుకెళ్లాలని హడావుడి చేశారు. అయితే వైద్యుల తీరుపై అనుమానం వచ్చిన రోగి బంధువులు.. వెళ్లి పేషెంట్‌ను చూడగా అప్పటికే మృతిచెంది ఉన్నారు. దీంతో ఆసుపత్రి నిర్వాకం బయటపడింది.
ఏం జరిగిందంటే..
వైద్యుల నిర్లక్ష్యం ఓ వృద్ధురాలి ప్రాణాన్ని బలితీసుకుంది. అది కప్పిపుచ్చుకోవడానికి చనిపోయిన పేషెంట్ పరిస్థితి క్రిటికల్‌గా ఉందంటూ సదరు ఆస్పత్రి వైద్యులు హంగామా సృష్టించారు. ఈ వ్యవహారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది. కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో గత ఐదురోజుల క్రితం సుజాతనగర్ రెడ్డి పాలెంకు చెందిన ముసుగు మల్లమ్మ(75) అడ్మిట్ అయ్యారు. తొంటికి ఫ్రాక్షర్ అయిందన్న నేపథ్యంలో వైద్యులు ఆపరేషన్ చేశారు. 5 రోజుల పాటు చికిత్స చేసి.. వేల రూపాయల బిల్లు వసూలు చేశారు. చివరకు వైద్యం వికటించి మల్లమ్మ మృతి చెందింది. దీంతో వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి పేషెంట్‌ను తీసుకెళ్లాలి..కండీషన్ క్రిటికల్‌గా ఉందంటూ వైద్యులు హంగామా చేశారు. అనుమానం వచ్చిన కుటుంబీకులు మల్లమ్మ వద్దకు వెళ్లి చూడగా అప్పటికే చనిపోయినట్టు గ్రహించి.. ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆస్పత్రిని సీజ్ చేయాలని ఆందోళన చేపట్టారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.