ఆయన పోలీస్ కానిస్టేబుల్. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సాక్షాత్తూ మంత్రి చేతుల మీదుగా ‘ఉత్తమ పోలీస్’ అవార్డు కూడా అందుకున్నాయి. అయితే, ఆ తర్వాత రోజే ఓ ఇసుక కాంట్రాక్టర్ వద్ద రూ.20వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డాడు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఏసీబీకి దొరికిన పోలీస్ కానిస్టేబుల్ పేరు తిరుపతి రెడ్డి. మహబూబ్ నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఇసుక కాంట్రాక్టర్ వద్ద లంచం డిమాండ్ చేశాడు. తన వద్ద ఇసుక రవాణాకు సంబంధించిన అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్పినా కూడా వినకుండా రూ.20వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ట్రాక్టర్ ఓనర్ ముదావత్ రమేష్ ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ సూచన మేరకు ఈనెల 16న రమేష్.. కానిస్టేబుల్ తిరుపతి రెడ్డికి రూ.17వేలు ఇచ్చాడు. అదే సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడు తిరుపతిరెడ్డిని అరెస్ట్ చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.