కొంత మంది పరువు కోసం ప్రాణాలు తీస్తారు.. మరి కొంతమంది పరువు కోసం ప్రాణాలు తీసుకుంటారు. మొదటి నుంచి వారు పెరిగిన వాతావరణ పరిస్థితులు అలా ఉంటాయి. కూతురు తనకు తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేదని వేరే వ్యక్తి తో వెళ్లిపోవడంతో పరువుకు తట్టుకోలేక తల్లిదండ్రులు తనువు చాలించారు. అతని పేరు నారాయణ(45) కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు నిహారికకు ఈ మధ్యనే పెళ్లి నిశ్చయం అయింది. కానీ ఆమె కు ఈ వివాహం ఇష్టం లేదు. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేదు. ఈ వివాహం ఇష్టంలేని సదరు యువతి రెండు రోజుల కిందట మరో వ్యక్తితో వెళ్లిపోయింది. ఎంతో అపురూపంగా పెంచుకున్న కూతురు చేసిన పనికి కానిస్టేబుల్ దంపతులు మనస్తాపానికి గురయ్యారు. భయటకు చెబితే పరువు పోతుందని ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం శివారులోని కైలాష్ గార్డెన్ ఆవరణలో చోటుచేసుకుంది. సంగారెడ్డి రూరల్ సీఐ శివలింగం తెలిపిన వివరాల ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ గ్రామానికి చెందిన పల్లకొండ నారాయణ(45), ఆయన భార్య రాజేశ్వరి(40) కొన్నాళ్లుగా కందిలో నివాసం ఉంటున్నారు. 1995కు బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ నారాయణ గతంలో సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించేవాడు. ప్రస్తుతం జిన్నారం మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు నిహారికకు కొన్ని రోజుల క్రితం పెళ్లి నిశ్చయమైంది. కానీ ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో వేరు వ్యక్తితో వెళ్లి పోయింది. ఈ విషయం తెలుసుకున్న నారాయణ తన విధులకు సెలవు పెట్టి ఇంటికొచ్చారు. తన కూతురు ఇలాంటి నిర్ణయం తీసుకుంటుదని తట్టుకోలేక భార్యాభర్తలిద్దరు తీవ్రంగా కుమిలిపోయారు. పెళ్లి కుదిరిన తర్వాత కూడా తన కూతురు ఎక్కడికో వెళ్లిపోయిందని.. ఈ విషయం బంధులవులకు తెలిస్తే పరువు పోతుందని ఆ దంపతులు బాధ పడ్డారు. ఇంకా ఎవరి కోసం బతకాలి.. బతికి ఉండి ఏమి ప్రయోజనం .. చావే తమకు పరిష్కారం అని భావించి క్షణికావేశంలో దంపతులు ఒకే తాడుతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
సమాచారం తెలుసుకున్న అదనపు ఎస్పీ సృజన, డీఎస్పీ బాలాజీ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ మేరకు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ తెలిపారు. మృతదేహాలను సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్లు సీఐ వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Kandi, Love marriage, Man commit to suicide, Sangareddy, Wife and husband died