జోధ్‌పూర్: కుటుంబం అన్నాక అత్తాకోడళ్ల వైరం సర్వ సాధారణం. ఎక్కడో కొన్ని ఇళ్లలో తప్ప దాదాపు చాలా ఇళ్లలో అత్తంటే కోడలికి పడదు. కోడలంటే అత్తకు పడదు. అందుకే చాలా సీరియల్స్‌లో అత్తాకోడళ్ల ఎపిసోడ్స్ సంవత్సరాల కొద్దీ సాగుతుంటాయి. అత్తాకోడళ్లు మాటామాటా అనుకోవడం వరకూ చాలాచోట్ల జరిగేదే కానీ అత్తను కోడలు చంపడం.. ఆ తర్వాత ఒక మనిషిని చంపేశానన్న పశ్చాతాపం ఏమాత్రం వ్యక్తం చేయకపోవడం మాత్రం ఈ కోడలి విషయంలోనే జరిగింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్రాంతంలోని లునీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కోడలు అత్తను కర్రలతో కొట్టి చంపేసింది. పోలీసులు ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేసి లాకప్ చేసిన సందర్భంలో కూడా ఆ కోడలు విచారణలో నవ్వుతూ సమాధానమిచ్చింది. ఒక సమస్య తీరిపోయిందని ఆ కోడలు చెప్పిన మాటలు విని అవాక్కయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాహూ రేఖా అనే మహిళకు, పత్వారి రమేష్ అనే వ్యక్తికి రెండున్నరేళ్ల క్రితం వివాహమైంది. అయితే.. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో పెళ్లయిన కొన్ని నెలలకే రేఖా, రమేష్ విడిపోయారు. దాదాపు రెండేళ్ల నుంచి భార్యాభర్తలిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. రమేష్ ఒక్కసారి కూడా రేఖను తిరిగి కాపురానికి తీసుకెళ్లేందుకు వెళ్లలేదు.
అయితే.. రమేష్ ఉండే అదే ఊరిలోనే అతని సోదరులు, తల్లి కలిసి ఉండేవారు. పెళ్లయిన కొన్నాళ్లకే రమేష్ ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అప్పటి నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. రమేష్ భార్య సొంతూరు కూడా అదే కావడంతో ఆమె అదే ఊరిలో విడిగా ఉంటోంది. తనపై అత్త లేనిపోనివన్నీ ఊళ్లో జనానికి చెబుతోందని, కాపురానికి వెళ్లకపోవడంలో తప్పంతా తనదేనని అత్త అందరికీ చెబుతోందని ఆమెపై రేఖ పగ పెంచుకుంది. ఈ క్రమంలోనే.. అత్తపై పగతో రగిలిపోతున్న రేఖ మంగళవారం మధ్యాహ్నం అత్త ఉంటున్న ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఆమె అత్త తప్ప ఇంట్లో ఎవరూ లేరు. పొలాల్లో పనులు చేసుకునే సమయం కావడంతో అందరూ పొలానికి వెళ్లారు. అత్తను వెతుక్కుంటూ వెళ్లిన రేఖ ఆమెను చూడగానే కర్రలతో దాడికి దిగింది. ఆమె తప్పించుకుని పారిపోతుంటే వెంటాడి మరీ కొట్టింది.
తలపై పలుమార్లు కర్రలతో దాడి చేయడంతో రేఖ అత్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె చనిపోయిన తర్వాత కూడా కొట్టేందుకు ప్రయత్నించగా రేఖను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. రేఖను అరెస్ట్ చేశారు. రేఖ అత్త బాబూదేవి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కూర్చున్న రేఖ అత్తను చంపినందుకు ఏమాత్రం పశ్చాతాపం వ్యక్తం చేయలేదని పోలీసులు చెప్పారు. పైగా.. నవ్వుతూ.. ఇక సమస్య తీరిపోయిందని.. ఆమె వల్ల తాను చాలా బాధలు అనుభవించానని చెప్పడం గమనార్హం. రేఖకు పిల్లలు లేరు. భర్తకు దూరంగా ఉండటం, ఒంటరితనంతో మిగిలిపోవడంతో ఆమెను మానసిక ఒత్తిడి వెంటాడింది. తన పరిస్థితికి అత్తే కారణమని భావించి ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Murder, Rajasthan