(K.Lenin,News18,Adilabad)
మోసపోయే వాళ్లు ఉన్నంత కాలం మోసం చేసే వాళ్లు ఉంటూనే ఉంటారని మరోసారి రుజువైంది. టీవీ(TV)లో వచ్చే ఓ పాపులర్ షో పేరును అడ్డుపెట్టుకొని సైబర్ మోసగాళ్లు(Cyber fraudsters)ఓ పేద యువకుడి వల వేశారు. బీఎండ్లూ కారు(BMW CAR)ను గెలుచుకున్నారంటూ చేసిన ఫోన్ కాల్(Phone call)కి బాధితుడు ఉబ్బితబ్బిబ్బైపోయాడు. అదే అదునుగా సైబర్ నేరగాళ్లు అమాయక యువకుడ్ని 25లక్షలు పంపుతున్నట్లుగా రిసిప్ట్ పంపి ...ట్యాక్సుల పేరుతో సుమారు 9లక్షలు(9 lakhs)కాజేశారు. సీన్ కట్ చేస్తే బాధితుడికి అసలు నిజం తెలిసిపోయింది.
BMWకారు పేరుతో టోకరా ..
అడవుల జిల్లా, ఆదివాసుల ఖిల్లాగా పేరొందిన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిఎండబ్ల్యు కారు పేరుతో ఓ గిరిజన యువకుడికి వల వేసిన మోసగాళ్లు అతడిని ఆస్తులు అమ్ముకునేలా చేశారు. జిల్లాలోని తిర్యాణి మండలం పంగిడి మాదర గ్రామానికి చెందిన ఆత్రం రవీందర్ అనే గిరిజన యువకుడికి సైబర్ నేరగాళ్లు కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ పేరుతో పరిచయం చేసుకున్నారు. రవీందర్‌కు 25 లక్షల రూపాయల విలువ చేసే బీఎండబ్లూ కారును గెలుచుకున్నారని నమ్మించారు. బాధితుడికి ఫోన్ చేసి ప్రతి సారి ప్రభుత్వానికి చెందిన వేర్వేరు శాఖల పేర్లు చెబుతూ పోలీస్ అధికారులు, ఐటీ ఆఫీసర్స్ ఫోటోలు పెట్టి నమ్మించారు.
బహుమతి ఇస్తున్నట్లుగా బిల్డప్...
బీఎండ్లూ కారు కొనుగోలు చేసేందుకు పంపుతున్న 25లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్‌లో జమ చేసినట్లుగా రిసిప్ట్ పంపించారు. డబ్బులు అకౌంట్‌లో జమ కావాలంటే మొదట ప్రభుత్వానికి 50వేలు టాక్స్ కట్టాలని చెప్పడంతో రవీందర్ డబ్బులను పంపాడు. ఆ తర్వాత కూడా ఇదే తీరుగా అనేక రకాల ట్యాక్సుల పేరుతో సైబర్ నేరగాళ్లు యువకుడి నుండి సుమారు 8లక్షల 50 వేల రూపాయల వరకు రాబట్టుకున్నారు. కేటుగాళ్లు తనను మోసం చేస్తున్నారనే విషయం అర్ధం చేసుకోలేకపోయిన రవీందర్ తన పొలం, పశువులను అమ్మేసి ఆ డబ్బులను ఆన్లైన్ సెంటర్ల ద్వారా, ఫోన్ పే ద్వారా సైబర్ నేరగాళ్ల బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేశాడు.
ట్యాక్స్‌ల పేరుతో లక్షలు స్వాహా..
ఈ ఏడాది మార్చి నెల నుండి ఇప్పటి వరకు ఇదే విధంగా అనేక శాఖల పేర్లను అడ్డుపెట్టుకొని గిరిజన యువకుడు రవీందర్ దగ్గర డబ్బులు కాజేశారు. ఫోన్ చేసిన ప్రతీసారి డబ్బులు కట్టాలని చెప్పడంతో అనుమానం వచ్చి బంధువుకు విషయం చెప్పడంతో గఅసలు విషయం బయటపడింది. బహుమతి లేదు బీఎండబ్లూ కారు లేదు ఇదంతా ఫేక్ కాల్స్ అని ..సైబర్ నేరగాళ్లు మోసం చేసి డబ్బులు వసూలు చేశారని చెప్పడంతో ఖంగుతిన్నాడు. వెంటనే తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులతో మొరపెట్టుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు రాబడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asifabad, CYBER FRAUD, Telangana crime news