#జర భద్రం: సైబర్ క్రైమ్... రోజుకో సవాల్!

ఒకప్పుడు సైబర్ క్రైమ్ అంటే మూడునాలుగు రకాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అసలు ఆన్‌లైన్‌లో ఎవరు ఏరకంగా మోసాలు చేస్తారో తెలియదు. నోట్ల రద్దు తర్వాత ఈ మోసాలు మరిన్ని పెరిగిపోయాయి. ఓవైపు జనం డిజిటల్ కరెన్సీవైపు అడుగులు వేస్తుంటే... అంతే స్థాయిలో సైబర్ నేరాలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి.

Santhosh Kumar S | news18-telugu
Updated: July 27, 2018, 11:43 AM IST
#జర భద్రం: సైబర్ క్రైమ్... రోజుకో సవాల్!
Data Leak: 16 యాప్స్ నుంచి 61.7 కోట్ల యూజర్ డేటా లీక్... మీ డేటా భద్రమేనా?
  • Share this:
గతంలో ఏదైనా ఫీజు చెల్లించాలంటే పోస్టాఫీస్‌కు వెళ్లి ఛలానా తీసుకునేవాళ్లు. లేదా బ్యాంకుకు వెళ్లి డీడీ తీసుకొని సబ్మిట్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు జస్ట్ మూడునాలుగు క్లిక్స్‌తో పని జరిగిపోతుంది. ఎన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ అయినా స్మార్ట్‌ఫోన్‌లో జరిగిపోతున్నాయి. ఇదీ టెక్నాలజీ మహత్యం. అయితే ఇండియాలో ఇలా డిజిటల్ కరెన్సీ వాడకం రెండుమూడేళ్ల క్రితం చాలా తక్కువ. ఎప్పుడైతే నోట్ల రద్దు చేశారో అప్పట్నుంచీ డిజిటల్ కరెన్సీ వినియోగం పెరిగిపోయింది. కరెన్సీ రద్దు తర్వాత జనం కార్డ్ ట్రాన్సాక్షన్స్, ఆన్‌లైన్ లావాదేవీలు అలవాటు చేసుకున్నారు. అంతకుముందెప్పుడు కార్డులు వాడనివాళ్లు కూడా స్వైపింగ్ మొదలుపెట్టారు. నోట్ల రద్దు తర్వాత వ్యాపారులు కూడా డిజిటల్ కరెన్సీని యాక్సెప్ట్ చేయకతప్పలేదు. రోడ్డుపై టీస్టాల్స్ నిర్వాహకులు కూడా డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటున్నారు. ఒక్క పేటీఎం వ్యాలెట్‌లోనే 20 కోట్ల మంది లావాదేవీలు చేస్తున్నారంటే క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ ఎంతలా పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. చిన్నచిన్న టీ స్టాల్స్ దగ్గర్నుంచి కిరాణా షాపులు, మాల్స్, పెట్రోల్ బంకులు, రకరకాల బిల్లుల చెల్లింపుల్లాంటివన్నీ ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి.

జేబులోనో, పర్సులోనో డబ్బులు పెట్టుకోకుండా డిజిటల్ కరెన్సీతో షాపింగ్ చేయడం బాగానే ఉంటుంది. ఎక్కడైతే సౌకర్యం ఉంటుందో అక్కడ ముప్పు కూడా ఉంటుంది. డిజిటల్ పేమెంట్స్ పెరిగినట్టుగా సైబర్ మోసాలూ పెరుగుతున్నాయి. క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ ఎంత మేలు చేస్తున్నాయో... జనం జేబుకు అంత చిల్లుపెడుతున్నాయి. వాస్తవానికి కార్డు వినియోగం గురించి జనానికి పెద్దగా అవగాహన లేదు. దీంతో మోసగాళ్లకు ఈజీగా టార్గెట్ అయిపోతున్నారు. జేబులో కార్డు జేబులోనే ఉంటుంది. కానీ సైబర్ నేరగాళ్లు అకౌంట్ కొల్లగొట్టేస్తుంటారు.

సైబర్ నేరగాళ్లు ఎక్కువ మధ్యతరగతి జనం, నిరక్షరాస్యుల్నే టార్గెట్ చేస్తున్నారు సైబర్ ఛీటర్లు. కార్డు వినియోగంపై అవగాహన లేనివాళ్లు సులువుగా వలలో పడుతున్నారు. సైబర్ ఛీటర్లు ఫోన్ చేయడం... బ్యాంకు మేనజర్‌ని మాట్లాడుతున్నానని నమ్మించడం... కార్డు వేలిడిటీ అయిపోతుందనో, కార్డు అప్‌డేట్ చేయకపోతే బ్యాలెన్స్ ఖాళీ అవుతుందనో భయపెట్టి వివరాలు తెలుసుకుంటున్నారు. కార్డు నెంబర్, సీవీవీతో పాటు ఓటీపీ తెలుసుకొని ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ఇలా లక్షలకు లక్షలు ఖాళీ చేస్తున్నారు.


ఒకప్పుడు దొంగతనాలంటే దొంగలు నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ఎక్కడో కూర్చొని ఓ ఫోన్, సిమ్ కార్డు, కంప్యూటర్ సాయంతో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నవారిని కూడా బోల్తా కొట్టిస్తున్నారు. ఎక్కువగా జరిగేవి కార్డు మోసాలే. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వేలిడిటీ అయిపోతుందని నమ్మించి దోచుకోవడమే పని. గతంలో కూడా ఈ మోసాలు జరిగేవి. అయితే నోట్ల రద్దు తర్వాతే మోసాల సంఖ్య పెరిగింది. కారణం... జనం ఎక్కువగా క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తుండటమే. కార్డు వివరాలు అప్‌డేట్ చేస్తామని నమ్మించి మోసం చేయడం ఒక పద్ధతి అయితే... మీ కార్డుపై మీకు తెలియకుండా ట్రాన్సాక్షన్ జరిగిందని, వివరాలు చెప్తే ఆ ట్రాన్సాక్షన్ క్యాన్సల్ చేస్తామని నమ్మించి దోచుకోవడం ఇంకో పద్ధతి. ఆ డబ్బులు తాము ఎక్కడ చెల్లించాల్సి వస్తుందో అన్న భయంతో వివరాలు చెప్పి మోసపోతున్నారు అమాయకులు.నైజీరియన్లు ఇలాంటి మోసాలకు ఆద్యులు. వారిని చూసి ఇండియన్స్ కూడా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఓటీపీ నేరాలకు జార్ఖండ్‌లోని జామ్‌తారా కేరాఫ్ అడ్రస్. సైబర్ క్రైమ్‌కు "క్యాపిటల్ ఆఫ్ ఇండియా"గా జామ్‌తారాను పిలుస్తుంటారు. ఇండియాలో జరిగే ఓటీపీ మోసాల్లో సగానికిపైగా జామ్‌తారా యువకులే చేస్తుంటారు. అసలు ఓటీపీ మోసాలు ఎలా చేయాలో నేర్పే సంస్థలు ఆ ఊళ్లో ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. వీరిబారిన పడి మోసపోతున్న బాధితులు రోజూ సైబర్ పోలీసుల చుట్టూ తిరుగుతుండటం మామూలైపోయింది. నోట్ల రద్దు తర్వాత ఈ మోసాలు ఇంకా పెరిగాయి.


నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2014లో 9,622, 2015లో 11,592, 2016లో 12,317 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కలు చూస్తే ఏటేటా సైబర్ క్రైమ్ పెరుగుతోందని అర్థం చేసుకోవచ్చు. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే చాలావరకు సైబర్ క్రైమ్ నేరాలు పోలీస్ స్టేషన్ వరకు చేరవు. డబ్బులు కోల్పోయిన బాధితులు పోలీసు కేసులు ఎందుకులే అని ఊరుకునే సందర్భాలే ఎక్కువ. ఇలా దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతుండటంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సైబర్ క్రైమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. బాధితులెవరైనా ఈ లింక్‌ క్లిక్ చేసి https://cybercrime.gov.in/cybercitizen/home.htm నేరుగా కంప్లైంట్ చేయొచ్చు.ఒక్కసారి సైబర్ క్రిమినల్స్‌కి టార్గెట్ అయి డబ్బులు పోగొట్టుకుంటే వాటిని తిరిగి రాబట్టడం చాలా కష్టం. అందుకే డబ్బులు పోయిన తర్వాత బాధపడటం కన్నా అప్రమత్తత మేలు. అసలు మీ కార్డు ఎక్స్‌పైరీ అవుందనో, వివరాలు అప్‌డేట్ చేస్తామనో బ్యాంకు సిబ్బంది ఫోన్ చేయరన్న విషయం గుర్తుంచుకోవాలి. ఎవరు అడిగినా కార్డు నెంబర్, పిన్, సీవీవీ, ఓటీపీ నెంబర్లు చెప్పకూడదు. ఆ వివరాలు చెప్పాలని ఎవరైనా ఫోన్‌లో ఒత్తిడి చేస్తే సంబంధిత బ్యాంకుకు వచ్చి మాట్లాడతామని చెప్పాలి. అనుమానం వస్తే బ్యాంకులో కంప్లైంట్ చేయాలి. లేదా బ్యాంకు కాల్ సెంటర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. సైబర్ పోలీసులకూ సమాచారం ఇవ్వొచ్చు.
Published by: Santhosh Kumar S
First published: July 27, 2018, 11:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading