మాత్రల్లా కనిపిస్తున్న ఈ చిన్న చిన్న ఉండలు ఏంటో తెలిస్తే అవాక్కవుతారు.. మనుషుల పొట్టల్లోంచి బయటకు తీసి..

పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం (Photo Courtesy: ANI twitter)

ఈ చిన్న చిన్న ఉండలు ఏంటనే అనుమానం వస్తోందా..? అవి బంగారం పేస్ట్ ను కలిగి ఉన్న ఉండలు. వీటిని గల్ఫ్ దేశాల నుంచి అక్రమంగా భారత్ కు తీసుకు వస్తుండగా చెన్నై విమానాశ్రయంలో పట్టుబడ్డారు. వీటి ఖరీదు ఎంత ఉంటుంతో తెలిస్తే..

  • Share this:
    బంగారం ధర చుక్కలు చూపిస్తోంది. ఒకరోజు పెరుగుతూ, మరో రోజు తగ్గుతూ వస్తున్నా సాధారణ కస్టమర్లకు మాత్రం అందనంత దూరంలోనే ఉంటోంది. ఆల్ టైమ్ రికార్డ్ నుంచి కాస్త దిగువకు వచ్చినా సామాన్యులు బంగారం కొనాలంటే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాల్లో బంగారం ధర కాస్త తక్కువగా ఉంటుందని తెలిసి అక్కడ తెలిసిన వారి ద్వారా కొని తెప్పించుకుంటున్నారు. అయితే విదేశాల నుంచి తెచ్చుకోగలిగే బంగారం మొత్తం విషయంలో పరిమితులు ఉండటంతో ఆశించిన మేరకు అది సాధ్యపడటం లేదు. బంగారానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా అక్రమార్కులు కూడా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. గల్ఫ్ దేశాల నుంచి బంగారాన్ని భారత్ కు అక్రమ రవాణా చేస్తున్నారు. హైదరాబాద్ లోని శంషాబాద్, చెన్నై విమానాశ్రయం, బెంగళూరు, ఢిల్లీ విమానాశ్రయాల్లో ఎక్కువగా బంగారం అక్రమ రవాణా చేసేవాళ్లు పట్టుబడుతున్నారు.

    తాజాగా తమిళనాడులో గల్ఫ్ దేశాల నుంచి బంగారాన్ని అక్రమరవాణా చేసే వాళ్లను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం గల్ఫ్ నుంచి ఓ విమానం వచ్చింది. అందులోంచి దిగిన ప్రయాణికుల్లో ఎనిమిది మంది ఒక గుంపుగా బయటకు రావడం కస్టమ్స్ అధికారులకు కనిపించింది. దీంతో ఆ ఎనిమిది మంది గుంపుపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. వారిని పట్టుకుని లగేజీ చెక్ చేస్తే ఏమీ దొరకలేదు. అయినప్పటికీ వారిలో టెన్షన్ కనిపించడంతో కస్టమ్స్ అధికారుల్లో అనుమానం మరింత బలపడింది. దీంతో వారిని స్కానింగ్ చేస్తే అసలు విషయం బయటపడింది.

    బంగారాన్ని పేస్టులా మార్చి, ఆ పేస్టును కొన్ని క్యాప్సూల్స్ లో పెట్టి మాత్రలుగా మార్చేశారు. వాటిని ఆ ఎనిమిది మంది ప్రయాణికులు మింగేశారు. అసలు విషయం ఏంటో గుర్తించిన కస్టమ్స్ అధికారులు వాళ్ల పొట్టల్లోంచి బంగారాన్ని కక్కించారు. మొత్తం 4.15 కేజీల బంగారం వారి దేహాల్లోంచి బయటపడింది. వాటి విలువ ఏకంగా రెండు కోట్ల 17 లక్షల రూపాయలు ఉండొచ్చునని కస్టమ్స్ అధికారులు తేల్చారు. దీంతో ఆ ఎనిమిది మందిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి నేరాలకు ఏమైనా పాల్పడ్డారా.? అన్నది ఆరా తీస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published: