బస్సులో కట్టలు కట్టలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. బ్యాగుల నిండా డబ్బే డబ్బు. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఈ నోట్ల కట్టలను అధకారులు గుర్తించారు. బస్సులో ప్రయాణికులు కూర్చున్న సీట్ల కింద బ్యాగుల్లో నోట్ల కట్టలతో ఎవరికీ అనుమానం రాకుండా రవాణా చేస్తున్నారు నిందితులు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజల్ల వల్ల తనిఖీల్లో భాగంగా పోలీసులు సోదాలు చేశారు. జాతీయ రహదారిపై ఉన్న వీరవల్లి టోల్ ప్లాజా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆపి తనిఖీలు చేశారు. దీంతో పోలీసులు చేసిన సోదాల్లో ఈ నగదు బయటపడింది. అక్రమంగా నగదు రవాణా చేస్తున్నట్లుగా గుర్తించడంతో మొత్తం డబ్బును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం రూ. నాలుగు కోట్ల 76 లక్షలు ఉంది.
బస్సు పద్మావతి ట్రావెల్స్ కు చెందినది. బస్ నెంబర్ ఏపీ Ap39 TB 7555 . బస్సులో పాసింజర్ సీట్ల కింద లగేజ్ కెరియర్లో ప్రత్యేక బ్యాగుల్లో ఈ నగదును తరలిస్తున్నారు. బస్సు డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఆ నగదుతో సంబంధం ఉందని భావిస్తున్న మరో ఐదుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో విచారణ చేపట్టారు. విజయనగరం నుంచి గుంటూరు వెళ్తున్న బస్సులో ఇంత పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద మొత్తంలో నగదును బస్సుల్లో సీక్రెట్‌గా ఎవరికీ అనుమానం రాకుండా తరలించడంతో హవాలా లావాదేవీలేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మరో ట్రావెల్స్ బస్సులో పదికేజీల బంగారం కూడా దొరకడంతో దీనిపై అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదంతా బంగారం వ్యాపారుల పనే అని తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా అధికారులు బంగారం షాపుల్లో తనిఖీలు ప్రారంభించారు. లెక్కల్లో లేని బంగారం గుట్టు విప్పే పనిలో పడ్డారు. ఒకే రోజు.. రెండే ప్రాంతాల్లో తనిఖీలు.. పట్టుబడింది మాత్రం పదికోట్ల రూపాయలు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సోదాలు జరపగా.. రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో పది కోట్ల రూపాయలకు పైగా నగదు, పది కేజీల బంగారం పట్టుబడింది. ఈ తీగతో డొంకను కదిలిస్తున్నారు పోలీసులు. రాష్ట్రవ్యాప్తంగా చీకటి దందాకు చెక్ పెట్టేందుకు సిద్దమయ్యారు. ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో పద్మావతి ట్రావెల్స్ బస్సును ఆపి తనిఖీలు జరపగా.. 4 కోట్ల 78 లక్షల రూపాయల నోట్ల కట్టలు దొరికాయి. అటు తూర్పు గోదావరి జిల్లాలోనూ బస్సుల్లో సాగుతున్న ఈ దందాకు చెక్ చెప్పారు పోలీసులు. కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌ప్లాజా దగ్గర పద్మావతి ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సుల్లో నగదు.. బంగారం మార్చుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. ఓ బస్సులో నుంచి 5 కోట్ల 6 లక్షల నగదును.. మరో బస్సులో నుంచి 10 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు.
కోట్లలో బంగారం వ్యాపారం చేసేవారు అంతేస్థాయిలో ట్యాక్స్‌లు చెల్లించాల్సి వస్తోంది. అయితే దీన్ని తప్పించుకోవడానికి, ప్రభుత్వ ఖజానాకు ఎగనామం పెట్టేందుకు కొత్త ఎత్తులు వేశారు వ్యాపారులు. జీరో దందాకు తెరలేపారు. ప్రభుత్వ లెక్కల్లోకి చేరకుండా గుట్టుగా బంగారాన్ని కొని తరలించేస్తున్నారు. దీనికి ప్రైవేట్ ట్రావెల్స్‌నే కేంద్రంగా మార్చుకున్నారు. మరోవైపు డబ్బు తరలింపు విషయం డ్రైవర్, క్లీనర్‌కు ముందే తెలుసా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విజయనగరం నుంచి గుంటూరు వెళుతున్న బస్సులో నగదును ఎప్పుడు ఎక్కడ పెట్టారనే అంశాలపై విచారిస్తున్నారు పోలీసులు. విజయనగరంలోనే బస్సులో ఎక్కించారా.. లేక మార్గమధ్యలో నగదును బస్సులో ఉంచారా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.