Home /News /crime /

CROP LOAN SCAM BUSTED IN TELANGANA GRAMEENA BANK IN PEDDAPALLI DISTRICT SU KNR

తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రుణాల గోల్‌ మాల్.. మొత్తం కథ నడిపింది అతడే.. పరారీలో ఇద్దరు బ్యాంక్ మేనేజర్లు..

మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న రామగుండం సీపీ

మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న రామగుండం సీపీ

తెలంగాణ గ్రామీణ బ్యాంకులో నకిలీ పాసుపుస్తకాలతో పంట రుణాలు తీసుకున్నట్టు ఫిర్యాదు అందడంతో 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సంవత్సర కాలంగా రుణాలు చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంక్ మేనేజర్ రికార్డులను పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఇంకా చదవండి ...
  తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు‌లో పంట రుణాల గోల్‌మాల్‌కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు బ్యాంక్ మేనేజర్లు, ఓ కారు డ్రైవర్ ఇందులో కీలక పాత్ర పోషించినట్టుగా తేలింది. కారు డ్రైవర్ ప్రధాన సూత్రధారి కాగా, డబ్బుకు ఆశపడి బ్యాంక్ మేనేజర్లు అతను చెప్పినట్టు చేశారు. అయితే ప్రస్తుత మేనేజర్ ప్రేమానంద్.. కొన్ని రుణాలు చెల్లింపులపై అనుమానంతో రికార్డులను పరిశీలించగా అవి నకిలీ పాస్‌పుస్తకాలు అని తేలింది. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రామగుండం సీపీ సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. ముత్తారం మండలం మైదంబడ్డ గ్రామానికి చెందిన ప్రభాకర్.. 2016 నుంచి 2019 వరకు బ్యాంకు మేనేజర్‌ కారు డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే పంట రుణాలు తీసుకోవడానికి అవసరమైన పత్రాలు, ప్రక్రియపై అవగాహన పెంచుకున్నాడు. పంట రుణాలు తీసుకోవడానికి అవసరమైన నకిలీ పత్రాలు తయారు చేయించాడు.అలాగే పెద్దపల్లిలోని శ్రీ రాజరాజేశ్వర రబ్బర్‌ స్టాంప్స్‌ దుకాణంలో ఆర్డీవో, డిప్యూటీ తహసీల్దార్‌, తహసీల్దార్‌, వీఆర్వో స్టాంపులు చేయించాడు.

  ఇక, పట్టా పుస్తకాలు, టైటిల్ డీడ్ కోసం మంథని కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న సదానందం సాయం తీసుకున్నాడు. అనంతరం తన ప్లాన్‌ను అమలు చేశాడు. రుణాలు మాఫీ జరుగుతందని ప్రచారం చేశాడు. ముత్తారం, రామగిరి మండలాల్లో తనకు తెలిసిన వారికి పంట రుణాలు ఇప్పిస్తానని చెప్పారు. ఒక్కో రుణానికి రూ.5,000 కమీషన్‌ ఇస్తానని చెప్పి ఆ సమయంలో బ్యాంకు మేనేజర్లుగా పనిచేసిన రామానుజాచార్య, వెంకటేశ్వర్లుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారు క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే ఒక్కొక్కరికి రూ.లక్ష పంట రుణం ఇచ్చారు. ఇలా 153 మంది రైతులు పట్టాదారు పాసుపుస్తకాలతో నిందితులు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో కోటి 99లక్షల 89 వేల రూపాయల రుణం తీసుకున్నారు.

  ఇక, నకిలీ పాస్‌పుస్తకాలతో బ్యాంక్ రుణాలు పొందినట్టు ఫిర్యాదు అందడంతో.. అసలు సూత్రధారి ప్రభాకర్‌తో పాటు 11 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఐదుగురు పరారీలో ఉన్నారని సీపీ సత్యనారాయణ తెలిపారు. వారి నుంచి రూ. 5లక్షల 55 వేల నగదు, నకిలీ పాసుపుస్తకాలు, రబ్బరు స్టాంపులు, పహాని పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పరారీలో ఉన్నవారిలో ఇద్దరు బ్యాంక్ మేనేజర్లు, ఒక వీఆర్వో ఉన్నారని త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. రుణాలు తీసుకున్న రైతులను బాధితులుగా, సాక్షులుగా పరిగణించి కేసు విచారణ చేపట్టామని నకిలీ పాసుపుస్తకాలు ఎక్కడినుండి తెచ్చారు?, దీనికి ఎవరెవరు సహకరించరు అనే కోణంలో అరా తీస్తున్నామని తెలిపారు.
  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Bank loans, Peddapalli, Ramagundam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు