పెన్ను పట్టుకోవాల్సిన చేతితోనే గన్ పట్టుకున్నాడు. చిన్న తగాదాకే కక్ష పెంచుకున్నాడు. ఆడుకోవాల్సిన తోటి విద్యార్థిని బలిగొన్నాడు. ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థి లోకమంతా నూతన సంవత్సర వేడుకల కోసం ఎదురు చూస్తోంటే.. బులంద్‌షహర్ జిల్లాలోని 10 వ తరగతి చదువుతున్న ఒక మైనర్ విద్యార్థి మాత్రం తన సహచరుడిపై పగతో రగిలిపోయాడు. క్లాస్ రూంలో జరిగిన చిన్న తగాదాకే పథకం ప్రకారం తన క్లాస్‌మేట్‌ను కాల్చి చంపాడు. ఏకంగా ఆ బాలుడుపై మూడు సార్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఇద్దరూ మైనర్ బాలురు కావడం, నిందితుడు తరగతి గదిలో ఏకంగా తుపాకీతో కాల్పులకు తెగబడటం ఆందోళన రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు బాలురు 14 సంవత్సరాల వయస్సున్నవారే. కేవలం సీటుకోసం నిన్న ఇద్దరూ తగాదా పడ్డారు. దీంతో కోపం పెంచుకున్న నిందితుడు తన మామయ్య తుపాకీని పాఠశాలకు తీసుకెళ్లి మరీ గురువారం ఉదయం బాధిత విద్యార్థిపై మూడు సార్లు కాల్పులు జరిపాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
అంతేకాదు నిందితుడి బ్యాగులో మరో నాటు తుపాకీ కూడా ఉండటం పోలీసులను కూడా విస్మయపర్చింది. సైన్యంలోపనిచేస్తూ, ప్రస్తుతం సెలవులో ఉన్న తన మామ లైసెన్స్డ్ తుపాకీని ఎత్తుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడని సీనియర్ పోలీసు అధికారి సంతోష్ కుమార్ సింగ్ చెప్పారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ స్కూల్‌కు వెళ్లి నిందితుడైన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతడు వినియోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఆ విద్యార్థి అంకుల్ ఆర్మీలో పని చేస్తారని, సెలవుపై ఇంటికి రావడంతో ఆయనకు తెలియకుండా గన్ తెచ్చి తోటి స్టూడెంట్‌పై కాల్పులు జరిపాడని పోలీస్ అధికారి సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Gun fire, UP police, Uttar pradesh