బెట్టింగ్. వ్యసనానికి పర్యాయపదం. ఈ ఊబిలోకి దిగామంటే ఇక అంతే.. ఎంతకూ రాలేము. సాధారణంగా బెట్టింగ్ లు అనేవి ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులపై లేద మెజారిటీపై పెడతారు. లేదంటే క్రీడలపై ముఖ్యంగా క్రికెట్ , కబడ్డీ ఇతర ఆటలపై బెట్టింగ్ లు వేస్తూ ఉంటారు. కొంతమంది లాభం పొందుతారు.. మరి కొంత మంది సర్వం పోగొట్టుకుంటారు. అయితే ఈ బెట్టింగ్ అనే పదం ఇప్పుడు కరోనా నేపథ్యంలో విధించే లాక్ డౌన్ లపై పడింది. దేశంలో మొదటి సారి లాక్ డౌన్ గత సంవత్సరంలో విధించారు. అప్పడు జరిగిన ఆర్థిక నష్ణం అంతా ఇంతా కాదు. దాని నుంచి కోలుకోవడానికే చాలా సమయం పట్టేట్టు ఉంది. అది ముగియకముందే మళ్లీ సెకండ్ వేవ్ రూపంలో మహమ్మారి విరుచుకుపడుతోంది. రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో లాక్ డౌన్ విధించాలా.. వద్దా.. అనే సందగ్ధంలో రాష్ట్ర ప్రభుత్వాలు పడ్డాయి. ఆర్థికంగా నష్టపోయిన గాయం మానకముందే మరో సారి లాక్ డౌన్ విధిస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయని భావిస్తున్నాయి.
అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం నైట్ కర్ఫ్యూ లు అంటూ కరోనా కట్టడి చర్యలు ప్రారంభించాయి. స్వచ్ఛందంగా గ్రామాల్లో కూడా లాక్ డౌన్ విధించుకుంటున్నారు. అయితే దేశ వ్యాప్తంగా కేసులు పెరిగిపోతుండటంతో లాక్ డౌన్ విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బెట్టింగ్ బంగార్రాజులు భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కరోనాసెకండ్ వేవ్‌లో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వరుసగా రెండో రోజు 2 లక్షలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇక తెలంగాణలోనూ రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 3,840 కోవిడ్ కేసులు వెలుగుచూడగా, 9 మంది మృత్యువాతపడ్డారు. ఇలా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు కరోనా తీవ్రతను కూడా క్యాష్ చేసుకునే దుర్మార్గానికి ఒడిగడుతున్నారు.
ఈ నేపథ్యంలో బుకీలు బెట్టింగ్ దందాకు తెరతీశారు. మే 2 నుంచి దేశంలో లాక్డౌన్ ఉంటుందంటూ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. లేదు ఏప్రిల్ చివరి వారంలోనే ఉంటుందని కొంత మంది బెట్టింగ్ లు వేస్తున్నారు. ఇలా పదిహేను రోజులు, లేదా నెలరోజుల పాటు లాక్డౌన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో లాక్డౌన్ బెట్టింగ్‌లపై పోలీసులు ప్రత్యేక నిఘాపెట్టారు. ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Betting, Betting on lockdown, Bookies, Corona Vaccine, Corona virus, Covid cases, Lock down, Lockdown betting, Telangana