ఔరైయా: ఆ యువతీయువకుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికొచ్చి పెద్దలకు తమ ప్రేమ విషయం చెప్పారు. పెద్దలు తొలుత ఒప్పుకోకపోయినప్పటికీ చివరకు అయిష్టంగానే పెళ్లికి అంగీకరించారు. డిసెంబర్ 10న ఆ ప్రేమ జంటకు వివాహం జరగాల్సి ఉంది. కుల కట్టుబాట్లను తెంచుకుని, పెద్దలను ఒప్పించి ఒక్కటి కాబోతున్న ఆ జంటను విధి వంచించింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది.
ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఔరైయాకు చెందిన సచిన్ శ్రీవాత్సవ అనే యువకుడు, సోనీ అనే యువతి ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం మూలంగా ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. కొన్నాళ్లకు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.
రెండేళ్లుగా సచిన్, సోనీ ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించి పెద్దలకు తమ ప్రేమ గురించి చెప్పారు. ఇద్దరి కులాలు వేరువేరు కావడంతో ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. పెళ్లికి ససేమిరా అని తెగేసి చెప్పిన పెద్దలను సచిన్, సోనీ ఎట్టకేలకు తమ ప్రేమ వివాహానికి ఒప్పించారు. ఇంతలో సచిన్ శ్రీవాత్సవకు మరో శుభవార్త అందింది. అతనికి బ్యాంకు ఉద్యోగం వచ్చింది. దీంతో.. సచిన్, సోనీ ఎంతో సంతోషించారు. తాము కోరుకున్న జీవితంలోకి అడుగపెడుతున్న వేళ అన్నీ తమకు కలిసొస్తున్నాయని ఆనందించారు.
ఇద్దరి నిశ్చితార్థం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. కానీ.. ఒక్క రోడ్డు ప్రమాదం భార్యాభర్తలు కాబోతున్న ఈ ప్రేమ జంట ఆశలను చిదిమేసింది. పెళ్లి డిసెంబర్ 10న పెట్టుకోవడంతో షాపింగ్ చేసేందుకు కాన్పూర్‌కు స్కూటీపై సచిన్, సోనీ వెళ్లారు. సంతోషంగా పెళ్లి షాపింగ్ పూర్తి చేసుకుని తిరిగి అదే స్కూటీపై ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం వీరి స్కూటీని ఢీ కొట్టింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సచిన్, సోనీ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి షాపింగ్‌కు వెళ్లిన సచిన్, సోనీ రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్న విషయం తెలుసుకున్న ఇరు కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. కుమిలికుమిలి ఏడ్చారు. రెండు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో ఉండగా ఈ ఘటన జరగడంతో ఆ ప్రాంతం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇద్దరి మృతదేహాలను కుటుంబ సభ్యులు ఇంటికి తరలించారు. ఇద్దరికీ కలిపి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ.. ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని, ఆ వాహనం ఎవరిదో తేల్చే పనిలో ఉన్నామని తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతానికి దగ్గర్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Love marriage, Lovers, Road accident, Uttar pradesh