బండిపై ఎక్కించుకొని అడవిలోకి తీసుకెళ్తారు.. చంపేసి బంగారం దోచేస్తారు.. నరహంతక జంట

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటి వరకు 8 మంది హతమార్చినట్లు భర్త, 12 మందిని చంపామని భార్య చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు. వారిని ఎక్కడ ఎక్కించుకున్నారు? ఎక్కడ చంపారు? మృతదేహాలను ఏ ప్రాంతంలో పడేశారు? అనే దానిపై కూపీ లాగారు.

 • Share this:
  ఒంటరి మహిళలే ఆ దంపతుల టార్గెట్. ఒంటిపై బంగారం కనిపిస్తే చాలు.. పక్కాగా ప్లాన్ అమలు చేస్తారు. మాయమాటలు చెప్పి వారిని మభ్యపెడతారు. పని ఇప్పిస్తామని చెప్పి బండిపై ఎక్కించుకుంటారు. నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి దారుణంగా చంపేస్తారు. అనంతరం ఒంటిపై ఉన్న బంగారం, ఇతర ఆభరణాలు దోచుకొని పారిపోతారు. తెలంగాణలో ఈ నరహంతక జంట ఉదంతం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇప్పటి వరకు 8 నుంచి 12 మందిని హత్య చేసినట్లు తెలిసింది. వారిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో కీలక విషయాలను రాబట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్ పీఎస్ పరిధిలో ఇటీవల ఓ మహిళ అదృశ్యమయింది. ఎంత వెతికినా ఎక్కడా కనిపించలేదు. చివరకు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి. మహిళ కోసం గాలించారు. ఆమె పని కోసం ప్రతి రోజూ లేబర్ అడ్డాకు వెళ్తుంది. ఆ సమాచారంతో లేబర్ అడ్డా చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె మరో ఇద్దరితో కలిసి బండిపై వెళ్లినట్లు గుర్తించారు. సీసీ ఫుటేజీలో బండి నెంబరు క్లియర్‌గా కనిపించింది. ఆ నెంబర్ ఆధారంగా బండి యజమాని, అడ్రస్ వివరాలను తెలుసుకున్నారు. ఆ అడ్రస్‌కు పోలీసులు వెళ్లగా.. అదే సమయంలో భార్యాభర్తలు ఇల్లు ఖాళీ చేస్తూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం తెలిసింది. హత్యల బాగోతం బయటపడింది.

  అదృశ్యమైన మహిళను సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి చంపేసినట్లు దంపతులు అంగీకరించారు.వారిచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు జిన్నారం అటవీ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలా చాలా మందిని హత్య చేసినట్లు నిందితులు వెల్లడించారు. ఇప్పటి వరకు 8 మంది హతమార్చినట్లు భర్త, 12 మందిని చంపామని భార్య చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు. వారిని ఎక్కడ ఎక్కించుకున్నారు? ఎక్కడ చంపారు? మృతదేహాలను ఏ ప్రాంతంలో పడేశారు? అనే దానిపై కూపీ లాగారు. వారు ఇచ్చిన సమాచారంతో ఇప్పటికే పలుచోట్ల మృతదేహాలు లభ్యమయినట్లు సమాచారం. తెలంగాణలో సంచలనం రేపిన ఈ కేసు వివరాలను ఇవాళో, రేపో పోలీసులు అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం.

  ఇవి కూడా చదవండి:

  Birthday: ఈమె కన్న తండ్రికి అసలు మనసనేది ఉందా.. కూతురి పుట్టినరోజు  అని పుట్టింటికి పిలిచి

  Crime: ఈ ఫోటోని మహిళను జాలేస్తోందా ? ఈమె ఎంతో ఖతర్నాక్.. ఏం చేసిందంటే..
  Published by:Shiva Kumar Addula
  First published: