Home /News /crime /

అయ్యో పాపం.. చేయని నేరానికి ఈ భార్యాభర్తలిద్దరూ ఐదేళ్లుగా జైల్లోనే.. తీరా బయటికొచ్చాక చూస్తే..

అయ్యో పాపం.. చేయని నేరానికి ఈ భార్యాభర్తలిద్దరూ ఐదేళ్లుగా జైల్లోనే.. తీరా బయటికొచ్చాక చూస్తే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చేయని నేరానికి ఆ భార్యాభర్తలిద్దరూ ఐదేళ్లుగా జైలు శిక్ష అనుభవించారు. వాళ్లు నిర్దోషులని తెలిసి కోర్టు వారిని విడుదల చేయాలని ఆదేశించింది. కానీ బయటికొచ్చాక వాళ్లకు మరో కష్టం వచ్చి పడింది.

  ఇద్దరు భార్యాభర్తలు. వారికి ఓ ఐదేళ్ల బాబు, మూడేళ్ల వయసున్న పాప. హ్యాపీగా నడుస్తున్న వారి కాపురంలో అనుకోని కల్లోలం. వాళ్లు చేయని తప్పునకు ఆ భార్యాభర్తలిద్దరినీ పోలీసులు పట్టుకెళ్లిపోయారు. తమ అమ్మానాన్నల్ని ఎక్కడకు తీసుకెళ్తున్నారో, ఎందుకు తీసుకెళ్తున్నారో ఆ చిన్నారులకు ఏమీ తెలియదు. ఆ ఇంటి గుమ్మం ముందే తల్లిదండ్రులు వెళ్తున్న జీపు వైపు చూస్తూ ఉండిపోయారు. వారికి జైలు శిక్ష పడటం, ఐదేళ్ల తర్వాత వాళ్లు నిరపరాధులని తేలడంతో ఎట్టకేలకు బయటపడ్డారు. కానీ ఐదేళ్లుగా తమ పిల్లల కోసం జైల్లో ఉండే పడిన నరకయాతనకు మించిన మనోవేధనను ఆ తల్లిదండ్రులు ఇప్పుడు పడుతున్నారు. తమ పిల్లలు ఎక్కడున్నారో తెలియదు. ఏమై పోయారో తెలియదు. వారి కోసం ఒంటరిగా ప్రతీ అనాథాశ్రమాన్ని వెతుకుతూ పోతున్నారు. ఏంటీ ఇదేదో సినిమా స్టోరీ అనుకుంటున్నారా.? కాదు. ఇలాంటి ఘటనలు సినిమాల్లోనే కాదు. రియల్ గానూ జరుగుతుంటాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ విషాధగాథకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా ప్రాంతంలో నరేంద్ర సింగ్ అనే 40 ఏళ్ల వ్యక్తి టీచర్ గా పనిచేసేవాడు. అతడికి 30 ఏళ్ల నజ్మా అనే భార్య, ఐదేళ్ల కొడుకు అజీత్, మూడేళ్ల కుమార్తె అంజు ఉన్నారు. 2015వ సంవత్సరంలో ఓ ఐదేళ్ల బాలుడి దారుణ హత్య కేసులో నరేంద్ర సింగ్, నజ్మా దంపతులను నిందితులుగా అనుమానించి అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి జైలులోనే ఉన్నారు. అయితే అరెస్ట్ సమయంలో ఇంట్లోనే ఉన్న వారి పిల్లలను అనాథాశ్రమంలో చేర్పించినట్లు రికార్డుల్లో పోలీసులు పేర్కొన్నారు. అయితే దాదాపు ఐదేళ్ల పాటు జైల్లో ఉన్న తర్వాత విచారణలో ఆ భార్యాభర్తలిద్దరూ నిర్దోషులని తేలింది. వారు ఆ నేరానికి పాల్పడలేదనీ, అమాయకులని విచారణలో వెల్లడయింది. దీంతో వారిని విడుదల చేయాలని ఆగ్రా జిల్లా కోర్టు పోలీసులను ఆదేశించింది.

  అమాయక దంపతులను అరెస్ట్ చేసి, ఇన్నేళ్ల పాటు జైల్లో పెట్టడం చాలా దారుణమైన పని అని ఈ సందర్భంగా ఆగ్రా జిల్లా కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో ప్రాథమిక విచారణలో స్వయంగా పాల్గొన్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, అకారణంగా జైలు శిక్ష అనుభవించిన ఆ దంపతులు, ప్రస్తుతం అంతకుమించిన మనోవేధనతో బాధపడుతున్నారు. తమ పిల్లలు ఎక్కడ ఉన్నారో, ఏమైపోయారో తెలియడం లేదనీ, అనాథాశ్రమంలో చేర్చామని పోలీసులు చెబుతున్నారనీ, కానీ ఏ అనాథాశ్రమమో అన్నది వారికే క్లారిటీ లేదని ఆ భార్యాభర్తలిద్దరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ’మా పిల్లలు చేసిన నేరమేంటి. వారు అనాథలుగా బతకాల్సిన పాపం ఏం చేశారు. మమ్మల్ని పోలీసులు తీసుకెళ్లినప్పుడు నా కొడుకు అజీత్, కుమార్తె అంజు చాలా చాలా చిన్న పిల్లలు. ఇప్పుడు ఎక్కడున్నారో.. ఎలా ఉన్నారో తెలియడం లేదు. మేం అరెస్టయినప్పటి నుంచి ఇప్పటి వరకు మా పిల్లలను ఒక్కసారి కూడా మాకు చూపించలేదు. 2015వ సంవత్సరంలో మేం బెయిల్ కోసం ఒకసారి పిటిషన్ పెట్టుకున్నాం. అది తిరస్కరణకు గురయింది. ఆ తర్వాత మాకు డబ్బులు లేక మేం బెయిల్ పిటిషన్ ను, లాయర్ ను పెట్టుకోలేకపోయాం. చివరకు మా పరిస్థితి ఇలా తయారయింది.‘ అంటూ ఆ తల్లిదండ్రులిద్దరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు ఎక్కడున్నారో వెతికి పెట్టాల్సిందిగా పోలీసులను కోరుతున్నారు.
  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Crime news, Crime story, Husband kill wife, Wife kill husband

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు