మంచిర్యాల: భర్త అడుగుజాడల్లో నడవాలనుకున్నదో ఏమో ఆ ఇల్లాలు. బతుకు బండిని నెట్టుకువచ్చేందుకు భర్త బస్టాండ్‌లో కూల్ డ్రింక్స్ విక్రయిస్తుంటే, భార్య గాజులు అమ్ముతూ వచ్చిన డబ్బులతో ఉపాధిని పొందుతున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ డబ్బుపై ఆశతో అడ్డదారులు తొక్కడమే ఈ జంటకు చేటు చేసింది. జల్సాలకు అలవాటు పడి డబ్బులు సరిపోక దొంగతనాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు.
ఇంకేముంది.. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తాళం వేసి ఉన్న ఇళ్ళనే లక్ష్యం చేసుకొని రాత్రి పూట ఆ ఇళ్లలో చడీచప్పుడు లేకుండా చొరబడి దొంగతనాలకు పాల్పడుతూ ఆ వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా ఏడాదిగా సాగుతున్న వీరి బండారం తాజాగా బయటపడింది. ఆ దంపతులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వెలుగు చూసిన ఈ దొంగ దంపతులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్‌పల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి ప్రసాద్, ధనలక్ష్మి మంచిర్యాల పట్టణంలోని అహ్మద్ నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకుండేవాళ్లు. జీవనోపాధి కోసం భార్య ధనలక్ష్మి గాజులు అమ్ముతుంటే, భర్త ప్రసాద్ బస్టాండ్‌లో కూల్ డ్రింక్స్ విక్రయిస్తూ జీవనం సాగించేవాళ్లు. అంతవరకు బాగానే ఉంది. జల్సాలకు అలవాటుపడి, వ్యాపారం ద్వారా వస్తున్న ఆదాయం సరిపోక డబ్బు కోసం పక్కదారి పట్టారు. దొంగతనాలకు పాల్పడాలని నిర్ణయించుకున్న ఆ దంపతులు యేడాది కాలంగా తాళం వేసి ఉన్న ఇళ్ళను లక్ష్యంగా చేసుకొని జిల్లా కేంద్రంలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా ప్రసాద్ తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించి, రాత్రివేళల్లో ఇద్దరు కలిసి తాళాలు పగలగొట్టి నగదు, బంగారం, వెండి ఆభరణాలు దొంగతనం చేసేవారు.
ఈ క్రమంలో స్థానిక మార్కెట్ ఏరియాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు వీరు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకొని విచారించారు. ఈ విచారణలో అసలు బండారం బయటపడింది. నేరాలు ఒప్పుకోవడంతో ఆ ఇద్దరు దొంగ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి నాలుగు లక్షల రూపాయల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. ఏడాది కాలంగా తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని వీరు దొంగతనాలకు పాల్పడుతున్నారని చెప్పారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న పట్టణ సీఐ బి.నారాయణ నాయక్, ఎస్.ఐలు డి.కిరణ్ కుమార్, వి.ప్రవీణ్ కుమార్, ఎన్. దేవయ్యతో పాటు సిబ్బందిని ఏసీపీ అభినందించి రివార్డులను అందజేశారు.
కట్ట లెనిన్, న్యూస్ 18 తెలుగు, ఆదిలాబాద్ జిల్లా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Crime news, Manchiryala, Theft, Wife and husband