చిత్తూరులో విషాదం.. కరోనావైరస్ అనుమానంతో వ్యక్తి ఆత్మహత్య

తనకు కరోనా వైరస్ సోకిందని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఎవరూ ముట్టుకోవద్దని హెచ్చరించాడు. దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించిన కుటుంబ సభ్యులను రాళ్లతో తరిమివేసి.. ఇంట్లోకి వెళ్లి తాళం వేసుకున్నాడు.


Updated: February 11, 2020, 10:56 PM IST
చిత్తూరులో విషాదం.. కరోనావైరస్ అనుమానంతో వ్యక్తి ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చైనాలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనావైరస్ యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ వైరస్ పేరు చెబితేనే జనాలు వణికిపోతున్నారు. ఏ మాత్రం దగ్గు, జలుబు, జ్వరంగా ఉన్నా.. కరోనా వైరసేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానంతోనే చిత్తూరులో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. తొట్టంబేడు మండలం శేషమనాయుడుకండ్రిగలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలకృష్ణ (50)కు కొంతకాలంగా గుండె దడ అనిపిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల చికిత్స కోసం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి వెళ్లాడు.

బాలకృష్ణకు పరీక్షలు చేసిన డాక్టర్లు ఏదో వైరస్ సోకిందని చెప్పారు. రెండు రోజుల పాటు అక్కడే చికిత్స చేయించుకున్నాడు. అనంతరం ఆదివారం సాయంత్రం సొంతూరుకు వచ్చిన అతడు.. తనకు కరోనా వైరస్ సోకిందని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఎవరూ ముట్టుకోవద్దని హెచ్చరించాడు. దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించిన కుటుంబ సభ్యులను రాళ్లతో తరిమివేసి.. ఇంట్లోకి వెళ్లి తాళం వేసుకున్నాడు. అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఇంటి నుంచి పొలానికి వెళ్లిన బాలృష్ణ.. తల్లి సమాధి వద్ద ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు.

మృతుడికి గుండె, కాలేయ సమస్యలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. కరోనా ఉందనే అపోహతోనే చనిపోయాడని చెప్పారు. భార్య, ఓ కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాలకృష్ణ మృతితో శేషమనాయుడుకండ్రిగ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలతో ఎవరికీ కరోనా వైరస్ సోకలేదని.. సాధారణ ఫ్లూ లక్షణాలను కరోనావైరస్‌గా అనుమానించాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు.

First published: February 11, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు