కన్నబిడ్డలను కొడుతున్న పోలీసును పోలీసులే అరెస్టు చేశారు. మహారాష్ట్రలో ఈ ఘటన జరిగింది. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన 39 ఏళ్ల గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఒకరు తన కన్నబిడ్డలను చావగొడుతున్నాడు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆ పిల్లలు నాసిక్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాహుల్ మోరే అనే రైల్వే పోలీస్‌కు తన మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు 8 సంవత్సరాల కుమారుడు, మరొకరు 5 సంవత్సరాల కుమార్తె. కొన్నాళ్ల క్రితం అతడి మొదటి భార్య చనిపోయింది. ఆ తర్వాత అతడు రెండో పెళ్లి చేసుకున్నాడు. తన మొదటి భార్య ద్వారా పుట్టిన ఇద్దరు పిల్లలు వారి అమ్మమ్మ వారి ఇంట్లో ఉంటున్నారు. ఇటీవలే కన్నతండ్రి వద్ద ఉండడానికి వచ్చారు. అయితే, అప్పటి నుంచి తన పిల్లలను కొట్టడం మొదలు పెట్టాడు. తీవ్రంగా హింసించాడు. నాన్న కొట్టే దెబ్బలు భరించలేక పిల్లలు ఈ విషయాన్ని అమ్మమ్మకు చెప్పారు. ఆమె బంధువుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 16న వారు ఫిర్యాదు చేయడంతో రాహుల్ మోరేను అరెస్టు చేశారు. అయితే, తన రెండో భార్య ద్వారా పుట్టిన కొడుకును పెద్ద పిల్లలు ఇద్దరూ కొడుతున్నారని, అందుకే తాను వారి మీద చేయి చేసుకున్నానని రాహుల్ మోరే చెప్పారు.
మద్యం తాగి గోల చేస్తున్నాడని.. తగలబెట్టేశారు
మరో ఘటనలో ఓ వ్యక్తి మద్యం తాగి గోల చేస్తున్నాడంటూ బంధువులు అతడిని చెట్టుకు కట్టేసి నిప్పు పెట్టారు. అత్యంత దారుణంగా మంటల్లో కాలి చనిపోయాడు. ఒడిశాలో ఈ ఘటన జరిగింది. ఒడిశాలోని హండపా పోలీస్ స్టేషన్ పరిధిలో కడలిముండా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఓ 25 సంవత్సరాల యువకుడు నిత్యం మద్యం తాగి గోల చేస్తున్నాడు. బంధువులు, ఇరుగుపొరుగు వారు, గ్రామస్తులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ రోజూ ఇంటి మీదకు గొడవలు తెస్తున్నాడు. అతడికి మద్యం మానేయాలని కుటుంబసభ్యులు నచ్చజెప్పారు. బందువులు కూడా మద్యం తాగినా గోల చేయకుండా ఇంటి వద్దకు వచ్చి ఉండమని హెచ్చరించారు. అయినా సరే ఆ యువకుడు వారి మాట వినలేదు. తన పనిలో తాను ఉన్నాడు. రోజూ మద్యం తాగి వచ్చి ఇతరులతో గొడవపడడం చేసేవాడు. ఈ క్రమంలో అతడి తీరుతో కుటుంసభ్యులు, గ్రామస్తులు విసిగిపోయారు. అతడి వైఖరి శృతిమించడం, ఆడవారితో అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో కోపోద్రిక్తులయ్యారు.
ఈ క్రమంలో జనవరి 12వ తేదీ సాయంత్రం కూడా యువకుడు మళ్లీ మద్యం తాగి వచ్చి గొడవ చేయడం మొదలు పెట్టాడు. దీంతో బంధువులు అతడిని చెట్టుకు కట్టేశారు. బీభత్సంగా కొట్టారు. ఆ కోపంలో ఏకంగా అతడి మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ మంటల్లో అతడు సజీవదహనం అయ్యాడు. అయితే, మరికొందరు వెంటనే అతడిని తీసుకుని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. అయితే, అతడిని తీసుకుని వచ్చేసరికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. బాధితుడిని రాజ్ కిషోర్ ప్రధాన్‌గా గుర్తించామన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేస్తామని చెప్పారు. ప్రధాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:January 17, 2021, 20:16 IST