ప్రారంభించిన రెండు రోజులకే విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ వద్ద అపశృతి చోటు చేసుకుంది. ఓ ప్రాంతంలో ఫ్లై ఓవర్ నుంచి పెచ్చులు ఊడి కింద పడ్డాయి. ఆ సమయంలో ఫ్లై ఓవర్ కింద విధులు నిర్వహిస్తున్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ చేతికి భుజాలకు గాయాలయ్యాయి. దసరా ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బందోబస్తు కోసం ఆ కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి.. ప్రారంభించిన రెండు రోజుల్లోనే ఇలాంటి ఘటన జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ నేపథ్యంలో ఫ్లై ఓవర్ పటిష్టతపై వాహనదారుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు మరో సారి పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది.. ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న అంశంపై విజయవాడ వాసుల్లో ఉత్కంఠ నెలకొంది.
విజయవాడలో కొత్తగా నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్‌తో పాటు, బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ ను ఈ నెల 16న ప్రారంభించారు. వర్చువల్ విధానంలో తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచి సీఎం వైఎస్ జగన్, నాగపూర్ నుంచి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభం చేశారు. విజయవాడలో కొత్తగా నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్‌తో పాటు, బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభం అయ్యాయి. వర్చువల్ విధానంలో తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచి సీఎం వైఎస్ జగన్, నాగపూర్ నుంచి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభం చేశారు.
రూ.15,592 కోట్ల విలువైన 61 హైవే ప్రాజెక్టులకు సంబంధించి, 1411 కి.మీ పొడవైన రహదారుల నిర్మాణం కోసం ఈ-శిలాఫలకాల ఆవిష్కరణతో పాటు, వాటిని జాతికి అంకితం చేశారు. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి రిటైర్డ్ జనరల్ వీకే సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర మంత్రులు ఎం.శంకరనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నానితో పాటు, రహదారులు భవనాల శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు.