చిల్లర దుకాణాలే లక్ష్యం.. మాస్క్ ముసుగులో మోసం.. పెరుగుతున్న బాధితులు.. అసలేం జరిగిందంటే..

మోసాలకు పాల్పడుతున్న ప్రబుద్దుడు

Khammam Crime: కోవిడ్‌-19 కరోనా వైరస్‌ ధాటికి ప్రాణాలు కాపాడుకోవాలంటే అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం చెబుతోంది. తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాలి కూడా.. ఇది ప్రాణాలు రక్షించుకోడానికి మాత్రమే. కానీ ఇలా మాస్కు ధరించి ఒక వ్యక్తి కొత్త తరహా మోసాలకు తెరతీశాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  (జి. శ్రీనివాసరెడ్డి, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా)

  టూవీలర్‌ పైన దర్జాగా దిగుతాడు. కిరాణా దుకాణాలు.. చికెన్‌ సెంటర్స్‌ .. పెట్రోల్‌ బంక్‌లు.. ఇంకా చిల్లర ఎక్కువగా ఉండే షాపులే లక్ష్యంగా అతను తన పని కానిచ్చేస్తున్నాడు. వచ్చీ రాగానే వరుస కలిపేస్తాడు. గుర్తు పడదామంటే మాస్కు తీయడు. వరుస కలిపాడు కదాని మనోడు కాకపోతాడా అనుకుని ఏంకావాలి అని అడగ్గానే.. ఓ పదివేలకు చిల్లర నోట్లు కావాలంటూ అడుగుతాడు. నిత్యం షాపులోకి వచ్చే చిల్లర పైసలు లెక్కపెట్టి చేతికి ఇవ్వగానే.. తాగడానికి నీళ్లు కావాలని అడుగుతాడు. నీళ్లు తేవడానికి లోనికి వెళ్లగానే పెద్దనోట్లు ఇవ్వకుండానే నెమ్మదిగా ఉడాయిస్తుంటాడు. తీరా మోసం గుర్తించి తేరుకునేలోగానే అతని జాడలేనంత స్పీడ్‌గా వెళ్లిపోతాడు. ఇక జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేద్దామన్నా.. పోయింది ఐదు వేలో పదివేలో.. దీనికోసం పోలీసుస్టేషన్‌ చుట్టూ ఏం తిరుగుతాంలే మన ఖర్మ అనుకుని సరిపెట్టుకునేవాళ్లే ఎక్కువఅయ్యారు. ఇదే అతనికి కలిసొస్తున్న అంశం. ఇలా ఏ మాత్రం అనుమానం రాని రీతిలో ఓ మోసగాడు పట్టణాలు పల్లెలు అన్న తేడాలేకుండా తన పనికానిచ్చేస్తున్నాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో గత నెలరోజులుగా ఇలా మోసపోయిన వారి సంఖ్య తక్కువేమీకాదు మరి.

  సత్తుపల్లి రూరల్‌ మండలం సిద్ధారం గ్రామంలో ఉన్న గుళ్లపల్లి లక్ష్మీనారాయణకు చెందిన ఓ చికెన్‌ షాపు దగ్గరకు ఓ వ్యక్తి మాస్కుధరించి వచ్చాడు. మాటలు కలిపాడు. ఓ ఏడు వేలకు రూ.100, రూ.50 నోట్లు కావాలని కోరాడు. తెలిసిన వ్యక్తిలా మాట్లాడేసరికి చిల్లర ఇచ్చేశాడు. ఇంతలోనే అతను తనకు దాహంగాఉందని చెప్పడంతో నీళ్లు తేవడానికి లక్ష్మీనారాయణ లోపలికి వెళ్లాడు. అంతే అతను చిల్లరకు సంబంధించిన పెద్దనోట్లు ఇవ్వకుండానే ఉడాయించాడు. నీళ్లు తీసుకుని బయటకు వచ్చిన లక్ష్మీనారాయణకు మోసం అర్థమైంది. ఎవరన్నదీ ఆరా తీయడానికి ప్రయత్నించి, స్థానిక పంచాయతీ ఆఫీసులో ఉన్న సీసీ కెమెరా ఫుటేజిలో ప్రయత్నించాడు. వచ్చినట్టు, పోయినట్టు కనిపించినా.. ఆ టూవీలర్‌కు వెనకా ముందూ నెంబర్‌ ప్లేట్స్‌ లేవు. దీంతో అతను ప్రొఫెషనల్‌ అన్న విషయం అర్థమైంది.

  ఈ విషయం సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న స్థానికులు కొందరు తాము కూడా ఇలానే మోసపోయామని ఒకరికి ఒకరు చెప్పుకుని ఘొల్లుమన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి పరిసర గ్రామాలకు చెందిన వాడే అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తానికి కరోనా మాస్కును కూడా అవకాశంగా మలచుకున్న వైనాన్ని జనం చర్చించుకుంటున్నారు. అయితే ఇలాంటి మోసకారుల బారిన పడవద్దని పోలీసు అధికారులు కోరుతున్నారు.
  Published by:Veera Babu
  First published: