శేరిలింగంపల్లి: ఈరోజుల్లో కొందరు యువత క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు వారి జీవితాలనే తలకిందులు చేస్తున్నాయి. చేసిన తప్పు తెలుసుకునే లోపే జీవితాలు నాశనమైపోతున్నాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోతున్న కొందరు కన్న తల్లిదండ్రులు గురించి ఆలోచించకుండా తమ దారి తాము చూసుకుంటున్నారు. అది తప్పని తెలిసి ఆ తర్వాత పశ్చాతాపపడుతున్నారు. శేరిలింగంపల్లి పరిధిలో ఓ యువతి అదృశ్యమైన ఘటన కూడా ఈ కోవలోకి చెందిందేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. శేరిలింగంపల్లి డివిజన్‌లోని పాపిరెడ్డి కాలనీలో దేవికారాణి, రాజేష్ అనే భార్యాభర్తలు గత ఆరు నెలలుగా ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వీరికి ఉజ్జయిని అనే 18 ఏళ్ల వయసున్న కూతురు ఉంది. ఆమె డిగ్రీ చదువుతోంది. ఇటీవల ఆ యువతికి ఓ విషయంలో తల్లిదండ్రులతో గొడవ జరిగింది. తండ్రి రాజేష్ కూతురిని మందలించాడు. దీంతో.. ఉజ్జయిని తీవ్ర మనస్తాపం చెందింది. ఇక ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకుంది.
తల్లిదండ్రులు ఏం చెప్పినా తన మంచికేనన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోయింది. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని సెప్టెంబర్ 6న అనుకున్నంత పని చేసింది. సెప్టెంబర్ 6న ఉజ్జయిని కనిపించకుండా ఎటో వెళ్లిపోయింది. ఆమె దగ్గర ఉన్న ఫోన్ నంబర్‌కు కాల్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. దీంతో.. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ కూతురు కనిపించకుండా పోయిందని చందానగర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఉజ్జయిని పోతూపోతూ డైరీలో ఒక వాక్యం రాసి ఇంట్లో ఉంచి వెళ్లిపోయింది. ‘మమ్మీ నేను బ్రతకడానికి వెళుతున్నాను.. నన్ను వెతకకండి’ అని అందులో రాసి ఉంది.
ఆ రైటింగ్ తమ కూతురిదేనని ఉజ్జయిని తల్లిదండ్రులు చెప్పారు. ఆమె ఓ యువకుడిని ప్రేమిస్తోందని.. ఆ విషయంలో ఇంట్లో తెలిసే గొడవ జరిగిందని సమాచారం. ఇప్పుడు కూడా ఆ యువకుడితో కలిసి వెళ్లిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పైగా.. ‘నేను బ్రతకడానికి వెళుతున్నాను’ అని ఉజ్జయిని రాయడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇంట్లో ఉన్న దుస్తులు కూడా ఆమె తీసుకెళ్లడంతో ఎలాంటి అఘాయిత్యం చేసుకోదని తల్లిదండ్రులు ఆశతో ఉన్నారు. పోలీసులు యువతి ఆచూకీ కోసం వెతుకులాట సాగిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: College student, Crime news, Ranga reddy, Telangana crime news, Women missing