వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా మేళ్ల చెరువు మండలంలోని కందిబండ గ్రామంలో వెలుగుచూసింది. సీఐ శివరామిరెడ్డి , ఎస్సై నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మేళ్ల చెరువు మండలం కందిబండకు చెందిన ముళ్లగిరి ముత్యాలు(28)కు నాగమణితో ఎనిమదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడేళ్ల పాప, ఐదేళ్ల బాబు ఉన్నారు. కాగా.. అదే గ్రామానికి చెందిన మేరిగ నవీన్‌తో నాగమణి గత కొంతకాలం నుంచి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న భర్త ముత్యాలు పలుమార్లు భార్యను మందలించాడు. తమకు అడ్డు తగులుతున్నాడని భావించి ప్రియుడు నవీన్‌తో కలిసి భర్త ముత్యాలును హత్య చేసేందుకు పథకం రచించారు. అదేవిధంగా ఈ నెల 7న ముత్యాలు కూలీ పనులకు వెళ్లి వచ్చి మద్యం సేవించి తన ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి 11:30 గంటల సమయంలో భార్య, ఆమె ప్రియుడు కలిసి ముత్యాలు మెడకు చున్నీ బింగించి గట్టిగా లాగి హత్యచేశారు.
దీంతో ముత్యాలు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఏమీ తెలియనట్లుగా ఉదయం తన భర్త గుండెపోటుతో మరణించినట్లు అందరిని నమ్మించి అంతక్రియలు జరిపించింది. కాగా ముత్యాలు మృతిపై కుటుంబ సభ్యులు ఆమెను నిలదీయగా హత్య చేసినట్లు ఒప్పుకొని పారిపోయింది.
ఈ నేపథ్యంలో మృతుడి సోదరుడు ముళ్లగిరి వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా సీఐ శివరాంరెడ్డి, ఎస్సై నరేశ్ ఆదివారం ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూడ్చిపెట్టిన శవాన్ని వెలికితీయించారు. తహసీల్దార్ దామోదర్‌రావు, సీఐ శివరామిరెడ్డి సమక్షంలో పంచనామా నిర్వహించారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Extramarital affairs, Nalgonda, Telangana crime