ఎక్స్‌ప్రెస్ టీవీ ఎండీ చిగురుపాటి జయరామ్ హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. చిగురుపాటి జయరామ్‌ను రాకేష్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్‌లో హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి ఏపీలోని నందిగామ వద్ద రోడ్డుపక్కన పడేశాడు. తెలంగాణలో హత్య చేసి, ఏపీలో డెడ్ బాడీని పడేయడం వెనుక ఏదో ప్లాన్ ఉండే ఉంటుందని చాలా మంది అనుమానించారు. అయితే, చిగురుపాటి జయరామ్ హత్యపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హంతకులకు స్వర్గధామంగా మారిపోయిందని విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నేరం చేసినా తప్పించుకోవచ్చన్న ఉద్ధేశంతోనే చిగురుపాటి జయరామ్‌ను హైదరాబాద్‌లో చంపేసి డెడ్ బాడీని తీసుకొచ్చి ఏపీలో పడేశారని ఆయన ఆరోపించారు. ఏపీలో పోలీసులను ఎలాగైనా ‘మేనేజ్’ చేయొచ్చన్న ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటారని, ఏపీలో టీడీపీ సర్కారు అండదండలు ఉంటాయన్న భావనతోనే హంతకులు నిర్భయంగా శవాన్ని వదిలివెళ్లారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
విజయసాయిరెడ్డి ట్వీట్
హంతకులకు ఏపీ స్వర్గధామైంది. నేరం చేసినా తప్పించుకోవచ్చనే ధైర్యం క్రిమినల్స్ కొచ్చింది. చిగురుపాటి అనే NRIని హైదరాబాద్ లో చంపి ఏపికి తీసుకొచ్చి పడేయడానికి కారణం ఇదే. ఏపీ లో పోలీసులను మేనేజ్ చేయొచ్చు. ఎలాగూ టీడీపీ సర్కారు అండదండలుంటాయని హంతకులు నిర్భయంగా శవాన్ని వదిలి వెళ్లారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 7, 2019
రాకేష్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర చిగురుపాటి జయరామ్ రూ.4.5కోట్లు అప్పు తీసుకున్నారని, వాటిని చెల్లించకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, ఆ గొడవలో చిగురుపాటి జయరామ్ చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో చిగురుపాటి జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి మీద కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శిఖా చౌదరి, ఆమె తల్లి (చిగురుపాటి జయరామ్ సోదరి) మీద జయరామ్ భార్య అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఏపీ పోలీసుల మీద తనకు నమ్మకం లేదని, కేసును తెలంగాణకు బదిలీ చేయాలంటూ జయరామ్ భార్య కోరారు.
మరోవైపు ఈ కేసులో కొందరు తెలంగాణ పోలీసులు రాకేష్ రెడ్డికి సహకరించారన్న ఆరోపణలు రావడం, అదే సమయంలో జయరామ్ భార్య కూడా ఏపీ పోలీసుల మీద తనకు నమ్మకం లేదంటూ వ్యాఖ్యానించడంతో కేసును తమ పరిధి నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ ఏపీ డీజీపీ ఠాకూర్ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP Politics, Vijayasai reddy, Ysrcp