YouTuber : యూట్యూబ్‌లో అశ్లీల పదజాలంతో కూడిన గేమ్ ట్రిక్స్ వీడియోలు చేసి.. కోట్ల రూపాయలు సంపాదించాడు మదన్. మదన్ యూట్యూబ్ ఛానెళ్ల బాధ్యతలను అతడి భార్య కృతిక చూసుకునేది.
ఆన్లైన్ గేమింగ్ కామెంట్రీలో అశ్లీల భాషను వాడుతున్న యూట్యూబర్‌ను అరెస్టు చేశారు తమిళనాడు పోలీసులు. అతడి యూట్యూబ్ ఛానెల్‌కు సుమారు ఎనిమిది లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉండటం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. 'టాక్సిక్ మదన్ 18+' పేరులో ఒక గేమింగ్ యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నాడు చెన్నైకి మదన్ కుమార్ మణికం. అసభ్యకరమైన భాష వాడుతూ, అశ్లీల సంస్కృతిని వ్యాపింపజేస్తున్నాడనే అభియోగాలతో అతడిపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో జూన్ 14 నుంచి అతడు కనిపించకుండా పోయాడు. అయితే పరారీలో ఉన్న మదన్‌ను జూన్ 18న ధర్మపురి జిల్లాలో అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడు 2019లో ‘మదన్’ పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్‌ను క్రియేట్ చేశాడు. నిషేధించిన PUBG గేమ్ సహా గేమింగ్ ట్రిక్స్ గురించి అతడు వీడియోలు చేసేవాడు. ప్రస్తుతం ఈ ఛానెల్‌కు 8 లక్షల మంది వరకు సబ్స్క్రైబర్లు ఉన్నారు. గేమింగ్ లైవ్ స్ట్రీమింగ్ కోసం అతడు 'టాక్సిక్ మదన్ 18+' పేరుతో మరో యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేశాడు. అయితే ఈ ఛానెళ్ల సబ్స్క్రైబర్లలో చాలామంది 18 ఏళ్లలోపు వారే ఉన్నారు. పబ్జీని భారత్‌లో నిషేంధించిన తరువాత వీపీఎన్ టెక్నాలజీతో గేమ్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేసేవాడు. ఈ క్రమంలో గేమ్ ఆడుతున్నప్పుడు మైనర్ బాలికలు, యువతులతో అసభ్యకరంగా మాట్లాడేవాడు. ఇలాంటి అశ్లీల కామెంట్రీతో లక్షల మంది ఫాలోవర్లను అతడు సంపాదించగలిగాడు.
మదన్ వీడియోలలో అశ్లీల భాషను ఉపయోగిస్తున్న విషయంపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా అతడు జూన్ 14న చెన్నైలోని సైబర్ క్రైమ్ పోలీసుల ముందు హాజరవ్వాల్సి ఉంది. కానీ దర్యాప్తునకు హాజరు కాకపోవడంతో సిటీ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది. అతడిపై ఐటీ చట్టం, ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న మదన్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను నియమించారు.
మదన్ యూట్యూబ్ ఛానెళ్ల బాధ్యతలను అతడి భార్య కృతిక చూసుకునేది. నిందితుడు మొబైల్ నంబర్‌ను ట్రాక్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు, జూన్ 16న కృతికను అరెస్టు చేశారు. మదన్ ఉపయోగించిన ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ఒక మొబైల్ ఫోన్‌ను కృతిక నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆమెను జూన్ 30 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. అయితే ముందస్తు బెయిల్ కోసం మదన్ తరఫున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. అనంతరం ప్రత్యేక బృందం ధర్మపురి సమీపంలోని ఒక గ్రామంలో యూట్యూబర్ మదన్‌ను అదుపులోకి తీసుకుంది.
నిందితుడి నుంచి రెండు లగ్జరీ కార్లు, ఒక యాపిల్ ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మదన్ తన యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా భారీగా ఆస్తులు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో మదన్‌పై సుమారు 160 వరకు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.