YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం

YS Viveka Murder Case: కరోనా కారణంగా కొంతకాలంగా ఈ కేసు దర్యాప్తు వాయిదా పడుతూ వస్తోంది. అయితే త్వరలోనే ఈ స్పెషల్ టీమ్‌ రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనుందని తెలుస్తోంది.

news18-telugu
Updated: October 15, 2020, 10:06 AM IST
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం
వైఎస్ వివేకానంద రెడ్డి (ఫైల్ ఫొటో)
  • Share this:
ఎన్నో మలుపులు తిరుగుతున్న మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో ఓ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఏడాది జులై 9న సీబీఐ ఈ దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు బాధ్యతలు ఢిల్లీలోని స్పెషల్ బ్రాంచ్‌కి అప్పగించారు. IPC సెక్షన్ 302 ప్రకారం హత్యానేరం అభియోగంతో కేసును రీరిజిస్టర్‌ చేశారు. మొదట వివేకా మృతిపై సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు దీన్ని 302గా ఇప్పుడు మార్చారు. ప్రత్యేక నేరాల దర్యాప్తు విభాగానికి చెందిన థర్డ్‌ బ్రాంచ్‌ డీఎస్పీ దీపక్ గౌర్‌కి ఈ కేసు తేల్చే బాధ్యతను అప్పగించారు. కరోనా కారణంగా కొంతకాలంగా ఈ కేసు దర్యాప్తు వాయిదా పడుతూ వస్తోంది. అయితే త్వరలోనే ఈ స్పెషల్ టీమ్‌ రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనుందని తెలుస్తోంది.

ఇక కేసుకు సంబంధించి సీబీఐ ఇప్పటికే అనేక మంది అనుమానితులను ప్రశ్నించింది. వివేకా పీఏతో పాటు ఆయన సన్నిహితులను విచారించింది. కొద్దిరోజుల క్రితం పులివెందులలో చెప్పుల దుకాణం యజమాని మున్నా, అతడి కుటుంబ సభ్యులను విచారించారు. మున్నా బ్యాంక్‌ లాకర్‌లో రూ. 48 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని అధికారులు గుర్తించారు. మరికొన్ని బ్యాంకు ఖాతాల్లో రూ. 20 లక్షల ఎఫ్‌డీలు ఉన్నట్లు తేల్చారు సీబీఐ అధికారులు. అతడి ఖాతాల్లో అంత డబ్బు ఎక్కడిది? అనే దానిపై సీబీఐ అధికారులు కూపీ లాగుతున్నారు.

గతంలో మున్నా ఫ్యామిలీ వివాదాల్లో వైఎస్ వివేకాందరెడ్డి కలగజేసుకున్నట్లు సమాచారం. భార్యాభర్తల వ్యవహారంలో మున్నాను అప్పట్లో ఆయన మందలించినట్లు తెలిసింది. మున్నా ముగ్గురిని వివాహం చేసుకోవడంతో.. వారి పంచాయతీ వైఎస్ వివేకా వద్దకు వచ్చిందని, ఆ క్రమంలో మున్నాను వైఎస్ వివేకా మందలించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మున్నా మొదటి భార్యను రెండు రోజుల పాటు సీబీఐ అధికారులు విచారించారు. అనంతపురం జిల్లా కదిరిలో నివాసం ఉంటున్న మున్నా ఇంటికి వెళ్లి.. అతడి తల్లి సమక్షంలో బ్యాంక్ లాకర్ తెరిచారు. లాకర్‌లో ఉన్న నగదు, ఇతర అభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

కాగా, 2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యపై అప్పట్లో ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగింది. ఎన్నికల ముందు హత్య జరగడంతో.. టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వివేకానంద హత్యపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఐతే నాటి టీడీపీ ప్రభుత్వం మాత్రం సిట్ ఏర్పాటు చేసింది. పలువురిని విచారించినప్పటికీ కేసు కొలిక్కిరాలేదు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఏర్పాటు చేశారు. సిట్ అధికారులు పలువురు అనుమానితులతో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని కూడా విచారించింది.

సిట్‌తో న్యాయం జరగడం లేదని.. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కేసును సీబీఐకి అప్పగించింది ఏపీ హైకోర్టు. అనంతరం రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు కొన్ని నెలలుగా ఈ కేసును విచారిస్తున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: October 15, 2020, 10:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading