Army jawan caught in honeytrap : పాకిస్తాన్(Pakistan)నిఘా సంస్థ ఐఎస్ఐ(ISI)పన్నిన వలపుల వల లో భారత సైనికుడు చిక్కుకున్నారు. భారత సైన్యానికి చెందిన అత్యంత రహస్య, వ్యూహాత్మక సమాచారాన్ని ఐఎస్ఐ మహిళా ఏజెంట్‌కు చేరవేశాడన్న ఆరోపణలతో రాజస్తాన్ పోలీసులు శనివారం ఓ సైనికుడిని అరెస్ట్ చేశారు. .నిందితుడు జోధ్‌పుర్‌లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్ ప్రదీప్ కుమార్ అని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ప్రదీప్ కుమార్(24) మూడేళ్ల క్రితమే సైన్యంలో చేరాడు. ప్రస్తుతం రాజస్తాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో జవానుగా విధులు నిర్వహిస్తున్నా డు. ప్రదీప్ కుమార్ కి ఆరు నెలల క్రితం ఫేస్ బుక్ లో ఓ మహిళ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. వెంటనే ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడు ప్రదీప్. అయితే ఫేస్బుక్లో పరిచయమైన పాకిస్తానీ మహిళ తాను హిందువునని, బెంగళూరులోని ఆర్మీ నర్సింగ్ సర్వీస్ సిబ్బందిగా పరిచయం చేసుకుంది. తర్వాత వాట్సాప్ లో అతడితో చాటింగ్ ప్రారంభించింది. పెళ్లి చేసుకుందామని, అంతకుముందు ఢిల్లీలో కలుద్దామని ప్రదీప్‌ను నమ్మించింది. తన వలలో ప్రదీప్ చిక్కుకున్నట్లు నిర్ధరించుకున్న తర్వాత దేశ రహస్యాల గురించి అడగడం ప్రారంభించింది.
ALSO READ Love Story : పుతిన్ కూతురు ప్రేమ కథ..ప్రియుడి కోసం 50 సార్లు అక్కడికి వెళ్లిందంట!
ఆమె కోరిక మేరకు ఢిల్లీ వచ్చిన ప్రదీప్ సైన్యానికి చెందిన పలు రహస్య పత్రాలను సేకరించి వాట్సాప్ లో ఆమెకు పంపించాడు. పాక్ మహిళతో ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా ప్రదీప్ టచ్‌లో ఉన్నాడని, భారత సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఆమెతో షేర్ చేసుకున్నట్లు గుర్తించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కొద్దిరోజుల పాటు నిఘా వేసిన తర్వాత సైనికుడిని అరెస్ట్ చేశామన్నారు. మే 18న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. అఫీషియల్ సీక్రెట్ యాక్ట్,1923 ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేసి.. తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు, పాకిస్తాన్ యువతి హానీట్రాప్‌లో చిక్కుకుని, దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలను ఫేస్బుక్లో పరిచయమైన యువతికి చేరవేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత వైమానిక దళ అధికారి దేవేంద్ర శర్మను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సోషల్ మీడియా ద్వారా దేవేంద్ర శర్మను పాక్ మహిళ హనీ ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ ఎయిర్‌ఫోర్స్ లో దేవేంద్ర ఎయిర్‌మెన్‌గా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. మిలిటరీ ఇంటెలిజెన్స్, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించి దేవేంద్ర శర్మను అదుపులోకి తీసుకున్నాయి. భద్రతకు సంబంధించిన కీలక సమాచారం అతడి ద్వారా బయటకు వెళ్తున్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే అధికారులు అరెస్ట్ చేశారు. .నిందితుడి భార్య బ్యాంకు ఖాతాలో కూడా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. హనీ ట్రాప్ వెనుక పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jawan photo release, Rajastan, WOMAN