CASE WAS FILED AGAINST THE PARENTS OF THE GIRL WHO KIDNAPPED HER FOR LOVE MARRIAGE IN MANCHIRYALA DISTRICT SNR KNR
Crime news : కొత్తగా పెళ్లి చేసుకొని భర్తతో వెళ్లిన యువతి కిడ్నాప్ .. 23మంది అరెస్ట్ .. ఎందుకు చేశారంటే..
(Manchiryala Kidnap case)
Crime news : కొత్తగా పెళ్లి చేసుకొని ఇంటికి తెచ్చిన అమ్మాయిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆమె భర్తను కొట్టి..ఇంటిని ధ్వంసం చేసి పారిపోతుండగా పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు. నిందితులు ఎవరో..? ఎందుకు కిడ్నాప్ చేశారో తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు.
(P.Srinivas,New18,Karimnagar)
అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. ఇద్దరికి ఇష్టం కావడంతో పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లి(Love marriage)ఇష్టం లేని అమ్మాయి కుటుంబ సభ్యులు ఎలాగైనా వారిని విడదీయాలని ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో తెలుగు సినిమా(Telugu movie)ల్లోని రొటీన్ సీన్‌ని రియల్ లైఫ్(Real life)లో అప్లై చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో పెళ్లి చేసుకున్న జంట పోలీస్ కేసు పెట్టడంతో ఫ్యామిలీ అంతా కటకటలాపాలయ్యారు. లవ్ యాక్షన్‌తో కూడిన సినిమా స్టోరీని తలపించిన యదార్దగాధ మంచిర్యాల(Manchiryala)జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రేమజంటపై పెద్దల కోపం.. మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మొర్రిగూడ గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున నాలుగైదు కార్లు వేసుకొని సుమారు 25మంది వచ్చారు. స్థానికంగా ఉంటున్న తోట నాగేష్ అనే యువకుడి ఇంటిని ధ్వంసం చేశారు. అతనిపై దాడి చేశారు. అతని భార్య లక్ష్మీని తీసుకొని వెళ్లిపోయారు. స్థానికంగా ఈసంఘటన కలకలం రేపింది. దుండగుల రూపంలో 20మందికిపైగా రావడం, కొట్టడం, ఇల్లు, సామాన్లు పగలగొట్టి యువతిని ఎత్తుకెళ్లడంతో నాగేష్ కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.
ప్రేమ పెళ్లి చేసుకుందని పగ..
బాధితుడి ఫిర్యాదుతో కిడ్నాపర్లు ఉపయోగించిన కార్లను వెంబడించారు. గంటల వ్యవధిలోనే దండేపల్లి మండలం ముత్యంపేట దగ్గర కిడ్నాపర్లను పట్టుకున్నారు జన్నారం పోలీసులు. మొత్తం 23మందిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్తున్న వ్యక్తులు ఎవరో తెలిసి షాక్ అయ్యారు పోలీసులు. కిడ్నాప్‌కు గురైన లక్ష్మీ స్వస్తలం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామం. మొర్రిగూడకు చెందిన తోట నాగేష్ని ప్రేమించింది. ఇద్దరికి ఇష్టం కావడంతో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లిని అంగీకరించని లక్ష్మీ తల్లిదండ్రులు ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత విడదీయాలని చూశారు.
యువతి కిడ్నాప్ కలకలం..
ప్రేమజంట పోలీసులను ఆశ్రయించడంతో ఇరువర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. యువతి తనకు ఇష్టమయ్యే ప్రేమ వివాహం చేసుకున్నానని .. తాను భర్తతోనే ఉంటానని చెప్పడంతో నాగేష్ లక్ష్మీని తీసుకొని మొర్రిగూడకు వెళ్లిపోయాడు. పోలీసులు లక్ష్మీ తల్లిదండ్రులను హెచ్చరించారు. యువతిని, ఆమె భర్తను ఇబ్బంది పెట్టినా, తీసుకెళ్లాలని ప్రయత్నించిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇవ్వడంతో గజ్వేల్‌కు వెళ్లిపోయారు.
23మంది అరెస్ట్ ..
ఇంటికి వెళ్లినప్పటికి వారిలో కోపం చల్లారకపోవడంతో ...శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులుగా వచ్చి లక్ష్మీని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాలని ప్లాన్ వేసుకున్నారు. అందులో భాగంగానే ఉదయం 4గంటల ప్రాంతంలో కార్లలో వచ్చి బీభత్సం సృష్టించారు. అమ్మాయిని తీసుకొన వెళ్తుండగానే పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో బాధితుడు నాగేష్ ఫిర్యాదు మేరకు మొత్తం 23 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కిడ్నాప్‌కు ఉపయోగించిన మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.