అమరావతిలో కాల్ మనీ... పోలీస్ స్టేషన్‌ ముందే వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

వెంకటేష్ అనే వ్యక్తి వడ్డీ వ్యాపారి వద్ద తన అవసరం నిమిత్తం రూ.6 లక్షలు తీసుకోగా ఆ వడ్డీ వ్యాపారి వడ్డీ రూపంలో రూ.23 లక్షలు కట్టించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

news18-telugu
Updated: December 15, 2019, 5:48 PM IST
అమరావతిలో కాల్ మనీ... పోలీస్ స్టేషన్‌ ముందే వ్యక్తి ఆత్మహత్యాయత్నం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కాల్ మనీ వ్యాపారుల ఆగడాలకు తాళలేక పోలీస్ స్టేషన్ ముందే వెంకటేష్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద జరిగింది. తాడేపల్లి సమీపంలోని ఉండవల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి వడ్డీ వ్యాపారి వద్ద తన అవసరం నిమిత్తం రూ.6 లక్షలు తీసుకోగా ఆ వడ్డీ వ్యాపారి వడ్డీ రూపంలో రూ.23 లక్షలు కట్టించుకున్నాడని, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ ఇబ్బంది పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని తన గోడును మీడియా ముందు వ్యక్తపరిచాడు. మొదట వడ్డీ వ్యాపారి తాను తీసుకున్న డబ్బుకు నెలకు రూ.3 వడ్డీ అంటూ చెప్పి, ఆ తరువాత కాల్ మనీ పేరుతో వడ్డీ వసూలు చేశాడని ఆరోపించాడు. డబ్బులు ఇవ్వకపోతే నీ అంతు చూస్తానంటూ బెదిరింపులు కూడా చేశాడని, ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వడ్డీ వ్యాపారి బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేస్తూ తాడేపల్లి పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకొని స్టేషన్లో అప్పగించారు.
ఈ విషయంపై తాడేపల్లి పోలీసులను వివరణ కోరగా ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని అధిక వడ్డీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని తాడేపల్లి సి.ఐ. అంకమ్మరావు మీడియాకు తెలియజేశారు. పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. అధిక వడ్డీలు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కానీ బాధితుడు పలువురికి ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని , ఆ కోణంలో ఏమైనా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పూర్తి విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

(రఘు అన్నా, గుంటూరు కరస్పాండెంట్, న్యూస్‌18)

First published: December 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>