ఏపీ రాజకీయాల్లో కృష్ణా జిల్లా ఎప్పుడూ హాటే. అక్కడ జరిగే ప్రతి అంశమూ రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపిస్తుంది. మరి అలాంటి జిల్లాలో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయి అన్నది ఇంట్రస్టింగ్ టాపిక్. ఇదివరకు టీడీపీ ప్రభుత్వంలో... కృష్ణా జిల్లా నుంచీ ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. ఇక్కడ కాపు, కమ్మ వర్గాలకు ప్రాధాన్యం ఎక్కువ. జిల్లా నుంచీ కాపు వర్గ ఎమ్మెల్యేలు నలుగురు ఉండగా... కమ్మ వర్గ ఎమ్మెల్యేలు ఇద్దరున్నారు. ఆ లెక్కన చూస్తే... చెరో వర్గం నుంచీ ఇద్దరికి మంత్రి పదవులు దక్కే ఛాన్సుంది. ఐతే పక్కనే ఉండే గోదావరి జిల్లాల్లో కాపు వర్గ ప్రాధాన్యం ఎక్కువ. సో, అక్కడి నుంచి కాపులకు అవకాశం ఇచ్చి, కృష్ణా జిల్లా నుంచీ కమ్మ వర్గానికి ఛాన్స్ ఇస్తారని చెప్పుకుంటున్నారు.
కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలుంటే... వైసీపీ 14 స్థానాలు సాధించింది. వాటిలో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఐదుగురు తొలిసారి ఎమ్మెల్యేలు అయినవాళ్లే. వాళ్లకు మంత్రి పదవి దక్కదనుకోవచ్చు. మిగతా వాళ్లలో ఇదివరకు మంత్రిగా పనిచేసినది కొలుసు పార్థసారథి మాత్రమే. ఆయన వైఎస్ కేబినెట్లో మంత్రిగా చేశారు. మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మళ్లీ ఆయనకు అవకాశం ఇస్తారనుకోవచ్చు. ఐతే... కేస్ట్ పరంగా చూస్తే... పార్థసారథికి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పోటీగా ఉన్నారు. ఇద్దరూ యాదవ వర్గం కాగా... అనిల్ కుమార్‌కి జగన్‌తో మంచి ర్యాపో ఉంది. పైగా కృష్ణా జిల్లా నుంచీ కమ్మ వర్గానికి కచ్చితంగా ఓ సీటు ఇస్తారని తెలుస్తోంది. గుడివాడ నుంచి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొడాలి నాని కేబినెట్ బెర్త్ కోసం ఎదురుచూస్తున్నారు.
నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు పేరు కూడా వినిపిస్తోంది. వెలమ వర్గానికి చెందిన ప్రతాప్ అప్పారావు తరపున ఆ వర్గం నేతలు తెలంగాణ సీఎం కేసీఆర్ ద్వారా సఫారసు చేయిస్తున్నారు. నిజానికి ఆ అవసరమే ఆయనకు లేదు. ఎందుకంటే ప్రతాప్ అప్పారావు వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పైగా నిజాయితీ పరుడు. ఇక కృష్ణా జిల్లా నుంచి కాపు వర్గానితే ఛాన్స్ ఇవ్వాలనుకుంటే... మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని రెడీగా ఉన్నారు. వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తండ్రి పేర్ని కృష్ణమూర్తి ఇదివరకు మంత్రిగా చేశారు.
ఎస్సీ వర్గం నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలనుకుంటే తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధికి ఛాన్స్ ఉంది. అలాగే వైశ్య వర్గం నుంచి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ కూడా మంత్రి పదవి ఇస్తానంటే వద్దనే ప్రసక్తే లేదంటున్నారు. వరుసగా రెండోసారి గెలవడం ఆయనకు ప్లస్ పాయింట్. కానీ కొలగట్ల వీరభద్రస్వామిని కాదని వెలంపల్లికి బెర్త్ ఇవ్వడం కష్టమే. ఇలా సామాజిక సమీకరణలు, చరిత్ర, రాజకీయ పరిస్థితులూ అన్నీ లెక్కలేసుకొని... జిల్లా నుంచీ ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తారని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.