ముస్లిం మహిళా ప్రముఖుల్ని అసభ్యంగా దూషిస్తూ, వాళ్లను ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచిన వివాదాస్పద ‘బుల్లీ బాయి యాప్’ ఉదంతంలో షాకింగ్ నిజాలు బయటికొస్తున్నాయి. దేశ రాజకీయాల్లో పెనుదుమారానికి దారితీసిన, ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్టకు మచ్చగా నిలిచిన బుల్లీ బాయి యాప్ సృష్టికర్తలను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ముస్లిం మహిళలపై జుగుప్సాకరంగా సాగిన ఈ దాడికి, బుల్లీ బాయ్ యాప్ కు సిక్కు మతస్తులనే బాధ్యులుగా చిత్రీకరించిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. బుల్లీ బాయి యాప్ కేసులో 18 ఏళ్ల యువతి శ్వేతా సింగ్, 21ఏళ్ల విశాల్ ఝాలను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సైతం సీరియస్ గా తీసుకున్న ఈ ఉదంతంపై పోలీసులు చెప్పిన అప్ డేట్స్ ఇవి..
దేశ రాజకీయాలు, మహిళా సమస్యలపై గళం వినిపిస్తోన్న ముస్లిం వర్గానికి చెందిన మహిళా జర్నలిస్టులు, లాయర్లు, హక్కుల కార్యకర్తలు దాదాపు 100 మందిని టార్గెట్ చేసుకుని, వాళ్ల ఫొటోలు, వివరాలను ఆన్ లైన్ లో ఉంచి, అసభ్యకర కామెంట్లతో బంపర్ ఆఫర్లంటూ వేలంపాట సాగించింది బుల్లీ బాయి అనే యాప్. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వారి ఇంటర్నెట్ హోస్టింగ్ ప్లాట్‌ఫారమ్ గిట్ హబ్ (GitHub) వేదికగా రూపొందిన బుల్లీ బాయి యాప్ ఉదంతం జనవరి 1న వెలుగులోకి వచ్చింది. సుల్లీబాయి తరహాలోనే గతేడాది బుల్లీ డీల్స్ పేరుతో వచ్చిన యాప్ లోనూ ఇదే పనిచేశారు..
వందల మంది ముస్లిం మహిళా ప్రముఖులపై జుగుప్సాకరంగా సాగిన ఈ తంతుపై బాధితురాళ్లతోపాటు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దురాగతంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసి.. మైక్రోసాఫ్ట్ తో మాట్లాడి బుల్లీ బాయి యాప్ ను బ్యాన్ చేయించారు. దీనిపై దర్యాప్తు చేసిన ముంబై పోలీసులు తాజాగా కీలక అరెస్టు చేశారు..
ముస్లిం మహిళల్ని వేలానికి ఉంచిన బుల్లీ బాయి యాప్ సృష్టికర్త.. బెంగళూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి విశాల్ ఝా అని పోలీసులు నిర్ధారించారు. అత్యంత షాకింగ్ అనిపించేలా ఈ యాప్ నిర్వాహకురాలు 18ఏళ్ల యువతి శ్వేతా సింగ్ అని, ఉత్తరాఖండ్ కు చెందిన ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నామని ముంబై పోలీసులు తెలిపారు. నిజానికి ఈ కేసులో శ్వేతా సింగే ప్రధాన ముద్దాయిగా, విశాల్ ఝా సహ నిందితుడిగా ఉన్నట్లు రిపోర్టుల్లో వెల్లడైంది. బుల్లీ బాయ్ యాప్ వెనుక సిక్కుల హస్తం ఉందనే ఆరోపణలపైనా పోలీసులు వివరణ ఇచ్చారు..
బుల్లీ బాయ్ యాప్ ను రూపొందించి, నిర్వహించి ముస్లిం మహిళల్ని వేలం వేసిన శ్వేతా సింగ్, విశాల్ ఝా ఉద్దేశపూర్వకంగానే ఈ నేరం సిక్కు మతస్తులే చేరారనే అర్థం వచ్చేలా యాప్ లో ఖలిస్థానీ గుర్తులను వాడారని, మైక్రోసాఫ్ట్ వారీ గిట్ హబ్ లోనూ తమ డొమెయిన్ పేరును ఖల్సా సూపర్‌మిస్ట్ అనే పేరుతో రిజిస్టర్ చేశారని ముంబై పోలీసులు వివరించారు. శ్వేతా సింగ్, విశాల్ ఝాలపై ఐటీ చట్టంలోని సెక్షన్ 354-డి (మహిళలను వెంబడించడం), సెక్షన్ 500 (పరువునష్టం) కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఇవాళ ఇద్దరినీ ముంబై తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితులిద్దరికీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయిందని పోలీసులు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobile App, Mumbai Police, Muslim Minorities, Women