పాట్నా: పెళ్లి జరిగి పట్టుమని ఐదు గంటలు కాలేదు. అప్పుడే కట్నం గురించి వరుడి కుటుంబం గొడవ పెట్టుకుంది. చివరికి పరిస్థితి వధువు కుటుంబంపై దాడి చేసే వరకూ వెళ్లింది. తన కుటుంబానికి జరిగిన అవమానంతో రగిలిపోయిన ఆ వధువు అత్తారింట్లో అడుగుపెట్టలేదు. నేరుగా పెళ్లి బట్టల్లోనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. వరుడిపై, అతని కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్లపై తగిన చర్యలు తీసుకునేంత వరకూ స్టేషన్ నుంచి వెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చుంది. ఊహించని ఈ పరిణామంతో పోలీసులు అవాక్కయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నలంద జిల్లా సూరజ్‌పూర్‌కు చెందిన మోహన్ ప్రసాద్ తన కూతురి పెళ్లిని ధనపూర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిపించేందుకు అక్కడికి కుటుంబం, బంధుమిత్రులతో అక్కడికి చేరుకున్నాడు. ధనపూర్‌లోని బీఎస్ కాలేజీ సమీపంలో నివాసముండే మేవాలాల్ సౌ కుమారుడు గోపాల్ కుమార్ వరుడు. వరుడు, అతని కుటుంబం కూడా ఫంక్షన్ హాల్‌కు చేరుకుంది. ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి తంతు ముగిశాక వధువును అత్తగారింటి పంపే సమయం రానే వచ్చింది. ఆ సమయంలోనే కట్నం గురించి వరుడి కుటుంబం పేచీ పెట్టింది. పెళ్లి కుదుర్చుకునే సమయంలో ఒప్పందం చేసుకున్న మొత్తం కంటే ఎక్కువ అడగడంతో వధువు కుటుంబం ఆశ్చర్యపోయింది. అంతకు ముందు అనుకున్నంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఇలాంటి సమయంలో కట్నం పెంచొద్దని కోరింది.
వరుడు, అతని కుటుంబం ఈ విషయంలో గొడవ పెట్టుకుంది. అడిగినంత కట్నం ఇస్తేనే అమ్మాయి అత్తగారింట్లో అడుగుపెడుతుందని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో వరుడు, వధువు కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ కాస్తా చిలికిచిలికి గాలివానగా మారింది. వరుడి కుటుంబం వధువు కుటుంబంపై దాడి చేసింది. ఈ ఘటనలో వధువు తరపు వాళ్లలో 8 మంది గాయపడ్డారు. తమను కొట్టి అవమానించేందుకే ఇప్పుడు మాట మార్చారని వధువు సోదరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇరు కుటుంబాలు ధనపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాయి. ఇరు కుటుంబాలకు సర్ది చెప్పి పంపించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వరుడి కుటుంబంపై చర్యలు తీసుకునేంత వరకూ స్టేషన్ నుంచి వెళ్లనని వధువు తెగేసి చెప్పింది.
పెళ్లి సమయంలోనే తన కుటుంబంపై దాడికి దిగుతుంటే.. ఇక పెళ్లి తర్వాత తన పరిస్థితి, తన కుటుంబం పరిస్థితి ఏంటని వధువు నిలదీసింది. పెళ్లి కూతురి తండ్రి మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ.. పెళ్లి కుదుర్చుకున్న సమయంలో రూ.10 లక్షలు కట్నం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని.. ఇప్పుడు రూ.15 లక్షలు డిమాండ్ చేయడం ఎంతవరకూ సబబని ఆయన ప్రశ్నించారు. పది లక్షల కట్నంతో పాటు ఐదు లక్షల బంగారం కూడా పెట్టామని ఆయన చెప్పారు. తమ కుటుంబ సభ్యులను రాడ్లతో కొట్టారని వధువు తండ్రి తెలిపారు. ధనపూర్ పోలీస్ అధికారి మోనాజీర్ ఆలమ్ ఈ వివాదాన్ని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: After marriage, Bihar, Crime news, Police station